అమెరికా, సౌదీ మితృత్వం బీటలు వారుతోందా..?
కష్టకాలంలో అండగా నిలిస్తేనే స్నేహానికి విలువ ఉంటుంది. అప్పుడే ఆమిత్రుడు.. నా నేస్తం నన్ను ఆదుకున్నాడని జీవితాంతం చెప్పుకుంటాడు. అదే అవసర కాలంలో హ్యాండిస్తే.. ఆద్రోహం జీవితాంతం సదరు మిత్రుడిని వెన్నాడుతుంది. ఇక జీవితంలో తనకు హ్యాండిచ్చిన వ్యక్తిని నమ్మలేడు. అదే భవిష్యత్ లోనూ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అమెరికన్లకు అదే భయం వెంటాడుతోంది. తమదేశం .. మిత్రదేశం సౌదీ అరేబియాకు హ్యాండివ్వడం ఘోర తప్పిదమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హూతీల నుంచి తమ దేశాన్ని రక్షించే విషయంలో అమెరికా (USA) సహాయనిరాకరణపై సౌదీ (Saudi Arabia) యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలు వారుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కారెన్ గిబ్సన్ వెల్లడించారు. అమెరికా చేసిన పనిని ఎంబీఎస్ ఎన్నటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఈ చర్య అమెరికాతో సంబంధాల విషయంలో సౌదీ పునరాలోచనలో పడేట్లు చేసిందన్నారు.
వాస్తవానికి హూతీలపై సైనిక ఆపరేషన్ చేపట్టాలని సౌదీ కోరగా.. అమెరికా మాత్రం కేవలం ఇంటెలిజెన్స్, ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మాత్రమే సమకూర్చి ఊరుకొంది. అమెరికా మిత్రదేశమైన బ్రిటన్ మాత్రం దీనికి భిన్నంగా సౌదీ కోరిక మేరకు దళాల ఆత్మరక్షణ కోసం ఎయిర్ టూ ఎయిర్ రిఫ్యూయలింగ్ సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చి.. కొన్ని వారాలపాటు కొనసాగనుంది. సౌదీకి బహిరంగంగా సైనిక మద్దతు అందించిన తొలి దేశంగా నిలిచింది. అంతేకాదు.. ఇతర మిత్ర దేశాలు కూడా సౌదీకి అండగా నిలవాలని కోరేందుకు బ్రిటన్ సన్నాహాలు చేస్తోంది. హూతీలను తరిమేస్తేగానీ.. బాబ్ అల్ మాండెబ్ సురక్షితంగా ఉండదని బ్రిటన్ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు అమెరికా మాత్రం ఒమన్ మధ్యవర్తిత్వంతో హూతీలతో చర్చలు జరుపుతోంది. అంతేకాదు.. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా దాడులు చేయబోమని హూతీలు తమకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించడం.. సౌదీని మరింత ఇబ్బందికి గురి చేసింది.
మరోవైపు యెమెన్‌లోని హూతీ రెబల్స్ ఎర్రసముద్ర తీరాన్ని వీలైనంత ఎక్కువగా తమ ఆధీనంలోకి తీసుకొంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత కీలక జలసంధి అయిన బాబ్ అల్ మాండెప్ మీద పూర్తిస్థాయి పట్టు సాధించారు. తాజాగా సౌదీకి 50 ఎఫ్-35 యుద్ధ విమానాలు విక్రయించేందుకు అమెరికా విదేశాంగశాఖ నోటిఫై చేసింది. కానీ, ఈ విమానాలు అందేందుకు కొన్నేళ్ల సమయం పట్టొచ్చు. మరోవైపు సౌదీ అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌కు చెందిన కీలక ప్రతినిధులతో న్యూయార్క్‌లో భేటీ కానున్నారు.








