అమెరికాలో ఏఐ ఫోర్స్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తామే బాస్ అన్న ట్రంప్…
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అమెరికాను ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుస్తామన్నారు అధ్యక్షుడు ట్రంప్. చైనాను దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏఐ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. . దేశంలో ఏఐ రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ఈ ‘ఏఐ ఫోర్స్’ ఉపకరిస్తుందన్నారు ట్రంప్. త్వరలోనే ఒక ‘ఏఐ జార్’ నియామకాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ఏఐ అపూర్వమైన వృద్ధిని సాధిస్తోందని, దీనిని అడ్డుకునే, అణచివేసే ఎలాంటి ప్రయత్నాలను తన పరిపాలనలో సహించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఏఐ రంగాన్ని ఒక సంపదగా భావించి కాపాడుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. తాను తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో అంతరిక్ష రంగాన్ని పటిష్ఠం చేసేందుకు ‘స్పేస్ ఫోర్స్’ను విజయవంతంగా ఏర్పాటు చేశానని, అదే తరహాలో ఇప్పుడు ‘ఏఐ ఫోర్స్’ను తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ బాధ్యతలను నిర్వర్తించేందుకు కేవలం అత్యున్నత ఐక్యూ ఉన్న ప్రతిభావంతులు అర్హులని, వారే దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఏఐ పేరు మార్పుపై ట్రంప్ సర్వే..
ఏఐ పేరును మార్చాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదం ఆకర్షణీయంగా లేదన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతికతకు మరింత సముచితమైన పేరును ఎంచుకునేందుకు ప్రజల నుంచి ఓటింగ్ కోరుతూ ఆయన ఒక వినూత్న సర్వేను చేపట్టారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సుపీరియర్ ఇంటెలిజెన్స్, ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుప్రీం ఇంటెలిజెన్స్ పేర్లు బాగుంటాయని మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించారు.








