ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీ
రాబోయే ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల పోరుకు బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రానున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, 5 కీలక మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ సమాయత్తమవుతోంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సమావేశానికి ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు, ఎమ్మెల్సీ పరిధిలోని కీలక నేతలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్న వేళ, అర్బన్ ఓటర్లతో పాటు విద్యావంతులు, యువత బీజేపీ వైపు మొగ్గు చూపేలా పక్కా కార్యాచరణను పార్టీ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను పూర్తిస్థాయిలో రంగంలోకి దించడం, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును మరింత బిగించడంపై విస్తృతంగా చర్చించారు. ఓటరు నమోదు ప్రక్రియ నుంచి పోలింగ్ బూత్ స్థాయి వరకు సమన్వయ లోపం లేకుండా ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని రాంచందర్ రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకత్వం, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్సీ అంజిరెడ్డిని నియమించారు. హైదరాబాద్-మహబూబ్‌నగర్- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ నేత మల్క కొమురయ్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియోజకవర్గాల్లో విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుని పోరాటాలు చేయాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి ఓటర్ల నమోదు అత్యంత కీలకమైన అంశం. దీన్ని గుర్తించిన బీజేపీ అధిష్ఠానం, ఈ నెల 27న హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై రాష్ట్ర స్థాయి ప్రత్యేక వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. ఈ రాష్ట్ర స్థాయి సదస్సు ముగిసిన వెంటనే, సంబంధిత నియోజకవర్గాల పరిధిలో జిల్లాల వారీగా వర్క్‌షాప్‌లు నిర్వహించి, ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను ఉద్యమ రూపంలో చేపట్టాలని నిర్ణయించారు. కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన యువతను, పట్టభద్రులను పెద్ద సంఖ్యలో ఓటర్లుగా చేర్పించడమే లక్ష్యంగా బూత్ స్థాయి కమిటీలకు టార్గెట్లు నిర్దేశించనున్నారు.
మరోవైపు పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకునే దిశగా 5 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కోసం ప్రత్యేక ఇన్ఛార్జ్లను బీజేపీ నియమించింది. ఈ 5 కార్పొరేషన్ల పరిధిలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక కమిటీలు దృష్టి సారించనున్నాయి. వార్డు, డివిజన్, బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, స్థానిక ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టడం, ప్రజలతో నిరంతరం మమేకమయ్యేలా కార్యక్రమాలు రూపొందించడం ఈ కమిటీల ప్రధాన బాధ్యత.
రాష్ట్ర నాయకత్వం నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు పూర్తి సమన్వయంతో కదం తొక్కితేనే ఆశించిన ఫలితాలు సాధించగలమని సమావేశంలో స్పష్టం చేశారు. ఎన్నికల సమయానికి కాకుండా, ముందుగానే ఇన్ఛార్జ్లను రంగంలోకి దించడం, వర్క్‌షాప్‌ల ద్వారా శ్రేణులకు దిశానిర్దేశం చేయడం చూస్తుంటే.. అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ఇటు 5 కార్పొరేషన్లలో బలమైన శక్తిగా ఎదిగేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోందని స్పష్టమవుతోంది.








