మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి, పేరు ఇదే..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల సరికొత్త ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్దమైన మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఇప్పుడు మీడియా రంగంలోకి కూడా అధికారికంగా అడుగుపెట్టారు. గతంలోనే తాను డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌తో పాటు తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన ఆయన, తాజాగా ఆ సంస్థ పేరును ఖరారు చేశారు. తన సరికొత్త మీడియా సంస్థకు ‘VSR Media’ అని పేరు పెడుతూ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ రూపంలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.
ఈ లోగో సోషల్ మీడియాలో బయటకు రావడంతో పొలిటికల్ మరియు మీడియా వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రాజకీయ పార్టీల ముసుగులో కాకుండా ప్రజల నిజమైన గొంతుకగా నిలిచేందుకే ఈ సరికొత్త మీడియాను ప్రారంభిస్తున్నట్లు విజయసాయిరెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. ఈ వీఎస్ఆర్ మీడియా సంస్థ ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ పక్షానికి అనుకూలంగా డబ్బా కొట్టదని, క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రారంభ దశలో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియా వేదికగా వార్తలను అందిస్తూ, ఆ తదుపరి రెండో దశలో పూర్తిస్థాయి తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు భోగట్టా ఇటీవలే వైకాపాను వీడి సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించిన విజయసాయిరెడ్డి, తన రాజకీయ భావజాలాన్ని మరియు ప్రజా పోరాటాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ మీడియాను ఒక పవర్ఫుల్ అస్త్రంగా వాడుకోనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ‘VSR Media’ డిజైన్ చాలా ఆకర్షణీయంగా, ప్రొఫెషనల్ లుక్‌తో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అత్యాధునిక సాంకేతికతతో, అనుభవజ్ఞులైన జర్నలిస్టుల బృందంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను అతి త్వరలోనే అధికారికంగా లాంచ్ చేయడానికి వెనుక పెద్ద కసరత్తే జరుగుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా, విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన తర్వాత ఈ మీడియా ఎంట్రీ ఏపీ పాలిటిక్స్‌లో మరింత హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.








