విద్యార్థుల్లో మానసిక వత్తిడి నివారణకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు : మంత్రి లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా 963 పాఠశాలల్లో హార్ట్ ఫుల్ యోగా శిక్షణకు చర్యలు
మిషన్ మార్చ్ ద్వారా 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు రాబట్టాలి
పారిశ్రామిక అనుసంధానిత క్లస్టర్ల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి
విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి: విద్యార్థుల్లో మానసిక వత్తిడిని నివారించేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారుల మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మానసిక ఆరోగ్యానికి సంబంధించి అవేర్ నెస్, ఇనిస్టిట్యూషనల్ సపోర్ట్ సిస్టమ్, గైడెన్స్ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మిషన్ మోడ్ లో ప్రారంభించాలని అన్నారు. దీనిపై సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు స్పందిస్తూ విద్యార్థుల మెంటల్ హెల్త్ కొరకు కేర్ ఎపి టూల్ ని సిద్దం చేశామని మరియు పైలట్ కూడా పూర్తి అయ్యిందని చెప్పారు. హార్ట్ ఫుల్ యోగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా 935 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షలమంది విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. దీనిపై శ్రీనివాసరావు స్పందిస్తూ… దీనిపై ఇప్పటికే హైదరాబాద్ లోని కన్హా శాంతి వనం అనే సంస్థ ద్వారా 2వేలమంది ఔత్సాహిక ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబోతున్నామని చెప్పారు. వీరిద్వారా ఈ ఏడాది హైబ్రిడ్ పద్ధతిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, వచ్చే ఏడాది నుంచి పూర్తి ఫిజికల్ గా యోగా శిక్షణాతరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే కుప్పం లోని అగస్త్య సైన్స్ ఫౌండేషన్ లో ఔత్సాహిక సైన్స్ ఉపాధ్యాయులకు జరగనున్న శిక్షణ గురించి తెలియజేశారు.
ఇప్పటివరకు పాటశాల విద్యలో సంస్కరణలు పూర్తయ్యాయి, ఇక అధికారులంతా ఫలితాలపైనే పూర్తిగా దృష్టిసారించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. టెన్త్, ఇంటర్మీడియట్ లలో 90శాతం ఫలితాల సాధన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అన్నారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరుశాతం మెరుగుదలకు ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేస్తున్న ఉపాధ్యాయులను, అధికారులను మంత్రి లోకేష్ అభినందించారు. పాఠ్యాంశాల బోధనలో వెనుకబడిన సబ్జెక్టు టీచర్లకు మెంటార్ టీచర్లతో కెపాసిటీ బిల్డింగ్ తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో వచ్చే ఏడాది చివరికి నూరుశాతం అక్షరాస్యత సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం, నిర్ణీత లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు.
స్కిల్ డెవలప్ మెంట్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పిఎం సేతు పథకం ద్వారా పారిశ్రామికవేత్తల సహకారంతో తొలివిడతగా 10పారిశ్రామిక అనుసంధానిత ITI క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం స్టీల్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆక్వా, ఫార్మా సంస్థలతో సంప్రదించి, 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ఎండి గణేష్ కుమార్ మాట్లాడుతూ… ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5.43లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించామని తెలిపారు. గత రెండేళ్లుగా జాబ్ మేళాల ద్వారా 1.72లక్షల మంది ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. జాబ్ మేళాల నిర్వహణలో శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్య డైరక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్ అన్సారియా, విద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవెన్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్చార్జి చైర్మన్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.








