పోటీ చేస్తా.. మళ్లీ గెలుస్తా.. దానం నాగేందర్ ధీమా
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో, ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్.. న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
లీగల్ గా ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడిన దానం నాగేందర్, మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని తెలిపారు. “ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే, నేను నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్నాను” అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగానే తాను ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
ఇదే సందర్భంలో ఆయన గత ఎన్నికల జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఢిల్లీకి వెళ్లొద్దు, ఖైరతాబాద్‌లోనే ఉండాలని భావించే ప్రజలు నన్ను గతంలో ఎంపీ ఎన్నికల్లో ఓడించారు. కానీ, నేను ఎంపీ బరిలో నిలిస్తే కిషన్ రెడ్డి సైతం భయపడ్డారు కదా?” అని వ్యాఖ్యానించారు. తాను గెలిచినా, ఓడినా ఖైరతాబాద్ ప్రజలు ఎప్పుడూ తన వెంటే ఉంటారని పేర్కొన్నారు. గతంలో ఒకసారి ఉప ఎన్నికలో ఓడిపోయినప్పటికీ, ప్రజల మధ్య తనకున్న ఆదరణ తగ్గలేదన్నారు.
రాబోయే ఉప ఎన్నికలో ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారనేదానిపై దానం నాగేందర్ నేరుగా స్పందించేందుకు నిరాకరించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే ఏ పార్టీ నుంచి పోటీ చేసేది చెప్తానన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్పై ఎలాంటి విమర్శలు చేయబోనన్న ఆయన, నియోజకవర్గంలో ఎవరు ప్రజలకు అండగా నిలిచారనేది ఖైరతాబాద్ ప్రజలకు బాగా తెలుసన్నారు. ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించే వ్యక్తినని, ప్రజలు తనకు ఎప్పుడూ అండగా ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న రీతిలో మాట్లాడిన దానం నాగేందర్, ప్రస్తుతానికి తాను ఎలాంటి రాజకీయ విమర్శలు చేయడం లేదన్నారు. అయితే.. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలే ఖైరతాబాద్‌లోనూ పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.








