ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక (Dasara Gift) ప్రకటించింది. దసరా పండగకే రెండు కరవు భత్యాల (డీఏ) మంజూరు చేసేందుకు అంగీకరించింది. తొలుత బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju)తో జరిగిన భేటీలో స్పష్టత రాలేదని ప్రకటించిన ఉద్యోగ ఐకాస, తర్వాత రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమక్షంలో జరిగిన చర్చలు సఫలమైనట్లు వెల్లడించింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎంసీఆర్ హెచ్ఆర్ డీకి రావాలని సీఎస్ నుంచి ఐకాస నేతలకు సమాచారం అందింది. అందుబాటులో ఉన్న నేతలు 8:30 గంటలకు అక్కడికి చేరుకోగా, అప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్ సంజయ్ జాజు విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశంలో ఉన్నారు. సీఎంతో చర్చలు ఉండొచ్చని భావించినా, చివరకు రాత్రి 10:45 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్ వచ్చి ఐకాస నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు డీఏలను దసరా పండగకే ఇస్తామని సీఎస్ ప్రకటించారు.








