దానంకు సుప్రీంకోర్టులో షాక్! ఉప ఎన్నిక ఖాయం!!
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా సమర్థించింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, దానం నాగేందర్ దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక లాంఛనంగా మారింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక పిటిషన్‌పై విచారణ జరిపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్, అనతికాలంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ఒక పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, మరో పార్టీ తరఫున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద తన సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడమే అవుతుందని హైకోర్టు గతంలో తేల్చిచెప్పింది. స్పీకర్ కార్యాలయం ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ జోక్యం చేసుకుని అనర్హత వేటు వేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దానం నాగేందర్ తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకున్న సభ్యుడి చర్యను క్షమించే అవకాశం పదో షెడ్యూల్లోని పేరా 2(1)(బి) కింద పార్టీకి ఉంటుందని వాదించారు. అయితే, ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. పేరా 2(1)(బి) నిబంధన కేవలం విప్ ధిక్కరణకు మాత్రమే వర్తిస్తుందని, పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకునే పేరా 2(1)(ఎ)కు ఇది వర్తించదని స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. “మీకు ఎమ్మెల్యేగా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే, ఎంపీగా షేర్ మార్కెట్లో ప్రయత్నించి ఆ ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా కోల్పోయారు” అంటూ జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ చేసిన వ్యాఖ్యలు కోర్టు హాల్లో నవ్వులు పూయించాయి. అలాగే, పార్టీ మారే పరిణామాలను ఉద్దేశించి “ఘర్ వాపసీ?”, “ఆయా రామ్, గయా రామ్” తరహా రాజకీయమేనా అంటూ చేసిన చురకలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే దానం నాగేందర్ అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టమైంది. స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూడకుండా న్యాయస్థానాలే నేరుగా ఫిరాయింపులపై కఠిన వైఖరి ప్రదర్శించడం ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే ఉపఎన్నిక నగారా మోగనుండటంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.








