బీఆర్ఎస్ సన్నిహితులకు ఉచ్చు.. భూములపై విచారణకు హైలెవల్ కమిటీ!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ల్యాండ్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, రిజిస్ట్రేషన్లపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితులకు భూబదలాయింపులపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు భూముల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించింది. సాంకేతిక, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన చైర్పర్సన్ గా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు దీనికి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు, ఏయే జిల్లాల పరిధిలోని భూములపై విచారణ జరుగుతుందో ఆయా జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.
తెలంగాణ అసెంబ్లీలో 22ఏ దుర్వినియోగం, నిషేధిత భూముల పరిధిపై జరిగిన వాడీవేడి చర్చ ఈ హైలెవల్ కమిటీ ఏర్పాటుకు ప్రధాన కారణమైంది. గత కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ భూములు, సీలింగ్ మిగులు భూములు, అసైన్డ్ భూములు, జాగీర్, భూదాన్, ఇనామ్, అటవీ భూములతో పాటు చెరువులు, కుంటల పరివాహక ప్రాంతాల భూములను 22ఏ జాబితా నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మార్పిడి చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారన్న ఈ అంశంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగడంతో, పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విచారణ కమిటీకి రేవంత్ సర్కార్ విస్తృతమైన అధికారాలను కల్పించింది. సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని నిర్దేశిత గ్రామాల్లో చట్టాలు, జీఓలు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలను ఈ బృందం సవివరంగా పరిశీలిస్తుంది. ఒకవేళ అక్రమాలు జరిగినట్లు తేలితే, అందుకు బాధ్యులైన అధికారుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరి జవాబుదారీతనాన్ని ఖరారు చేసి తగిన చట్టపరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది. ఈ విచారణకు సంబంధించి అన్ని రకాల భూ రికార్డులను వెంటనే సమర్పించాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్ శాఖలను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
గత ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో కొనసాగిన అగ్రనేతలు, వారి బంధువులు, అనుచరులతో ముడిపడి ఉన్న భూములే లక్ష్యంగా చేసుకుని ఈ విచారణ సాగుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఎంక్వైరీ కమిటీ పరిణామాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాబోయే రోజుల్లో తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసే సూత్రాలు కనిపిస్తున్నాయి. కమిటీ ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి.








