అయోమయంలో దానం నాగేందర్!?
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజకీయ తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ మార్పులు, అనర్హత వేటు, న్యాయపోరాటంలో ఎదురుదెబ్బలు తదితర పరిణామాలు ఆయనను తీవ్రమైన అయోమయంలోకి నెట్టేశాయన్న చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన, అనూహ్యంగా ఎదురైన పరిణామాలతో ఇప్పుడు తీవ్ర అంతర్మథనంలో ఉన్నట్లు అర్థమవుతోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతటితో ఆగకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఫిరాయింపుల చట్టం కింద ఆయనపై వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. అత్యున్నత న్యాయస్థానం కూడా ఆయన పిటిషన్‌ను కొట్టివేయడంతో ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది.
తాజా పరిణామాల నేపథ్యంలో దానం నాగేందర్ వ్యవహారశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా అనర్హత వేటు పడిన తరుణంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగించింది. అటు సీఎం, టీపీసీసీ కూడా దానంను పిలిపించి మాట్లాడలేదు. తాను ఉపఎన్నికలో పోటీ చేయడం ఖాయమని దానం చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫునే బరిలోకి దిగుతానని మాత్రం చెప్పట్లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి, టికెట్ ఖరారైన తర్వాతే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనేది చెబుతాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మనసులో ఏదో సందిగ్ధత లేదా అసంతృప్తి ఉందని తేటతెల్లం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, పార్టీ మారిన తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదా లేక హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల వేళ పార్టీ పెద్దల నుంచి ఆశించిన స్థాయిలో నైతిక మద్దతు లభించలేదనే బాధ దానంలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తూనే, మరోవైపు ఎన్నికల్లో పార్టీ పేరు చెప్పడానికి నిరాకరించడం ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలియజేస్తున్నాయి.
మొత్తంగా చూస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దానం నాగేందర్ ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కాస్త ఆయోమయంలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ గందరగోళంపై ఖైరతాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు.








