‘‘రథ యాత్ర’’ ప్రారంభమైతే అయ్యింది.. కలిసొస్తుందా మరి?
ఎన్నికలు వస్తున్నాయంటే అన్ని పార్టీలూ ఏదో ఒక యాత్ర చేపడతాయి. అది పాదయాత్రా? బస్సు యాత్రా? రథ యాత్రా? ఇలా రకరకాల యాత్రలను నిర్వహిస్తూ, ప్రజలకు దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది కలిసొస్తుంది కూడా. చాలా మంది నేతలు ఈ యాత్రలతో అత్యంత కీలకమైన పదవులను పొందగలిగారు కూడా.
ఇప్పుడు ఇదే కోవలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా వచ్చి చేరారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, లక్నో నుంచి రాయ్‌బరేలీ వరకు ‘PDA రథ యాత్ర’ ప్రచారాన్ని ప్రారంభించారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం చేపట్టిన ఈ యాత్రలో భాగంగా, పార్టీ కార్యకర్తలతో కూడిన ఎరుపు రంగు బస్సులు గురువారం రాష్ట్ర రాజధాని నుంచి బయలుదేరాయి. వెనుకబడిన వర్గాలు, దళితులు మరియు మైనారిటీల (పిచ్డా, దళిత్, అల్పసంఖ్యాక్) కూటమిపై దృష్టి సారిస్తూ, మధ్య ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ చేపట్టిన విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ‘PDA రథ’ యాత్రను నిర్వహిస్తున్నారు.
దీనిని అఖిలేష్ యాదవ్ ప్రగతిశీల, సానుకూల దృక్పథం కలిగిన కూటమిగా అభివర్ణించారు.ఏ వర్గాలనైతే దృష్టిలో పెట్టుకొని అఖిలేష్ రథయాత్రను ప్రారంభించారో, అవే వర్గాలు గత ఎన్నికల్లో బీజేపీకి గంపగుత్తగా మద్దతిచ్చాయి. అందులో కొన్ని ఎంఐఎంకి మద్దతిచ్చాయి. ఈ సారి వాటిని చీల్చాలని అఖిలేష్ ఓ వ్యూహం కూడా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రథ యాత్రకు అఖిలేష్ అచ్చు అలాంటి పేరే పెట్టారు కూడా. పిచ్డా, దళిత్, అల్పసంఖ్యాక్ అని రథయాత్ర పేరు.
అంతేకాకుండా ఒక్క రథయాత్రతో మూడు లక్ష్యాలను సాధించాలని అఖిలేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కుల ప్రాతిపదికన ప్రజలను సమీకరించడం, ప్రెషర్ పాలిటిక్స్ ను తెరపైకి తేవడం రెండోది, ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం. ఈ మూడు లక్ష్యాల కోసం ఈ యాత్రను చేపడుతున్నారు.
రాహుల్ గాంధీ పార్లమెంటరీ నియోజకవర్గమైన రాయ్‌బరేలీకి అఖిలేష్ ‘PDA రథం’ రాకపై వివిధ రాజకీయ విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘ఇండియా’ (INDIA) కూటమి పటిష్టంగా కొనసాగుతుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. ఈ కూటమిలో సీట్ల పంపకాలకు సంబంధించి ఇరు పార్టీల నాయకులు ప్రకటనలు చేస్తున్నారు.రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీ అయినప్పటికీ, 1999 నుండి కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని నిరంతరాయంగా తన ఆధీనంలో ఉంచుకుంటూ వస్తోందన్న విషయాన్ని గమనించాలి. అయితే, ఆ ప్రాంతంలో పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా లేదు. రాయ్‌బరేలీలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి; 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో నాలుగింటిని ఎస్పీ (SP) గెలుచుకోగా, రెండింటిని బీజేపీ గెలుచుకుంది. ఈ సారి రాయ్ బరేలీపై కూడా అఖిలేష్ కన్నేశారు.








