అరెస్ట్ లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
దేశ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీమ్ కోర్ట్ అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. నేడు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును ప్రకటించింది. దర్యాప్తు సంస్థలు లేదా పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు అనుసరించాల్సిన విధానాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ తాజా తీర్పు ప్రకారం, ఎవరినైనా అరెస్ట్ చేసే సమయంలో వారికి దానికి గల కారణాలను లిఖితపూర్వకంగా, దరఖాస్తుదారుడికి అర్థమయ్యే భాషలో తెలియజేయడం తప్పనిసరి.
అలా కారణాలు చూపకుండా, సరైన నిరసన పత్రాలు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనేది స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు ఏ అధికారికి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా అరెస్టులు చేసే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, వారిపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు శాఖాపరమైన విచారణ మరియు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అంతేకాకుండా, అరెస్టుకు గల సరైన కారణాలు చూపలేదనే సాంకేతిక కారణంతో ఒకవేళ నిందితుడి తొలి అరెస్టును కోర్టు గనుక రద్దు చేస్తే, ఆ వ్యక్తిని మళ్లీ అదే కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే పోలీసుల సొంత నిర్ణయాలకు తావులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సదరు నిందితుడిని తిరిగి అరెస్ట్ చేయడానికి మేజిస్ట్రేట్ (Magistrate) నుంచి ముందస్తుగా ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు బలమైన కారణాలతో మేజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని, ఆ అప్లికేషన్‌పై ఉన్నతాధికారి సంతకం (Endorsement) కూడా ఉండాలని నిబంధన విధించింది. పోలీసుల అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ, పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.








