కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు
రైతులు, బీసీలు, సామాన్యుల సంక్షేమానికి గుర్తింపుగా అభిర్ణించిన రేవంత్
దేశ రాజకీయాల్లో మార్పు కేరళ నుంచే షురూ అవుతుందన్న సీఎం
ఆ మార్పే దేశమంతా తుపానుగా మారాలని పిలుపు… రాహుల్ గాంధీ నాయకత్వంపై విశ్వాసం
ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందిః సీఎం రేవంత్ రెడ్డి
సంఘ్ పరివార్ దేశాన్ని విభజిస్తోంది… గాంధీ పరివార్ భారత ఐక్యతకు కృషి అంటూ వ్యాఖ్యలు
నిలంబూర్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కేరళలో ప్రతిష్ఠాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’ లభించింది. కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆ పురస్కారాన్ని రేవంత్ స్వీకరించారు. కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్… సీఎం రేవంత్‌రెడ్డికి అవార్డును ప్రదానం చేశారు. కేరళ దిగ్గజ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, సీఎం రేవంత్ రెడ్డి దూర దృష్టితో కూడిన నాయకత్వాన్ని గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువల పట్ల రేవంత్‌రెడ్డి చూపుతున్న నిబద్ధతను కూడా అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసించినట్లు వెల్లడించారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, కేరళలోని నాలుగు వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆర్యదాన్ ముహమ్మద్ ప్రజాసేవ, లౌకిక విలువలు, సామాన్యుల సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా కేరళలో గుర్తింపు పొందారు. ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో కే.సీ. వేణుగోపాల్ ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్యదాన్ ముహమ్మద్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు సేవలందించిన ఆయన కేరళ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు. నీలాంబూర్తో పాటు కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక బలమైన శక్తిగా నిలిచారని అన్నారు. ఆర్యదాన్ ముహమ్మద్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును అందుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేరళ వెలుపల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవడం మరింత ప్రత్యేకమని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తగా, రాహుల్‌గాంధీ నాయకత్వంలోని బృందంలో ఒక కార్యకర్తగా తాను ఈ అవార్డును స్వీకరిస్తున్నానని చెప్పారు. కేరళకు రావడం తనకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలోనూ, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇక్కడికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిసారీ కేరళ ప్రజలు తనకు ఆత్మీయ స్వాగతం పలికారని చెప్పారు. లౌకికవాదానికి అండగా నిలుస్తూ కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులకు మద్దతు ఇస్తున్న కేరళ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
‘కేరళ రాజకీయ గాలి… యావత్ దేశాన్నే ప్రభావితం చేస్తుంది’
దేశవ్యాప్తంగా సంఘ్ పరివార్ సారధ్యంలోని బీజేపీప్రభుత్వం భారతాన్ని మతం పేరిట విభజిస్తోందపి… గాంధీ పరివార్ మాత్రం భారత ఐక్యతకు కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భారత ఆత్మ(ఐడియా ఆఫ్ ఇండియా)కు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కేరళ రాజకీయాలకు దేశ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాతావరణ నిపుణులు రుతుపవనాల కోసం కేరళ వైపు ఎలా చూస్తారో… దేశ రాజకీయాలను అర్థం చేసుకునే విషయంలోనూ కేరళను ఒక సంకేతంగా చూడవచ్చని అన్నారు. కేరళలో చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1991లో కేరళలో కరుణాకరన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పీవీ నరసింహా రావు ప్రధానమంత్రి అయ్యారని, 1996లో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. 2001లో ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రి కాగా, 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. 2026లో కేరళలో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించడంతో కొత్త రాజకీయ గాలి మొదలైందని రేవంత్ రెడ్డి అన్నారు. “కేరళ నుంచి మొదలైన ఈ గాలి దేశమంతా తుపానుగా మారాలి” అని పిలుపునిచ్చారు.
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోసం పోరాటం
ఆర్యదాన్ ముహమ్మద్ తన జీవితాంతం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పని చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో మతతత్వ శక్తుల నుంచి ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీపై తీవ్ర రాజకీయ విమర్శలు చేశారు. స్వేచ్ఛ, లౌకికవాదం, రాజ్యాంగ విలువలను కాపాడటమే ఆర్యదాన్ ముహమ్మద్‌కు నిజమైన నివాళి అని అన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటు హక్కును పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
‘ఓటు హక్కును కాపాడాలి’
దేశంలో ఓట్ల దొంగతనం, పార్టీల దొంగతనం, ఎన్నికల గుర్తుల దొంగతనం, నిధుల దొంగతనం జరుగుతున్నాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా ఆరోపించారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కేరళను దేశ రాజకీయాలకు ‘బెల్వెదర్’(మార్పుకు ఒక సూచి) రాష్ట్రంగా అభివర్ణిస్తూ.. ఇక్కడ మొదలైన కాంగ్రెస్ గాలి దేశంలోని ప్రతి రాష్ట్రానికీ విస్తరించాలని ఆకాంక్షించారు. “కేరళ నుంచి మొదలైన కాంగ్రెస్ గాలిని దేశవ్యాప్తంగా తుపానుగా మార్చాలి” అని పిలుపునిచ్చారు.
‘రాహుల్‌గాంధీ ప్రధాని కావాలి, అదే నా లక్ష్యం’ సీఎం రేవంత్
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అధికారాన్ని, పదవులను త్యజించారని చెప్పారు. ఇప్పుడు చరిత్ర పిలుస్తోందని, రాహుల్‌గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కేరళ నుంచి పార్లమెంట్‌కు ఎన్నిక కావడం తనకు ఈ రాష్ట్రంతో మరింత అనుబంధాన్ని కల్పించిందని చెప్పారు. తనకు వ్యక్తిగత రాజకీయ ఆశలు లేవని, 2006లో క్షేత్రస్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని వివరించారు.
గత రెండు దశాబ్దాల్లో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వంటి వివిధ పదవులను చూశానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. “ఇక నా ముందున్న ఏకైక లక్ష్యం రాహుల్‌గాంధీని భారత ప్రధానమంత్రిగా చూడటం” అని స్పష్టం చేశారు. కేరళలో మొదలైన రాజకీయ మార్పు గాలిని దేశంలోని ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ప్రతి రాష్ట్రానికి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మార్పు గాలులు వీస్తున్నాయని, రాహుల్ గాంధీ ఆశాభావ సందేశం ప్రజల్లోకి వెళ్తోందని అన్నారు. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడే వరకు రాహుల్ గాంధీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
రేవంత్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వం, రాజ్యాంగ పరిరక్షణ, లౌకికవాదం, ఓటు హక్కు వంటి అంశాలను కేంద్రంగా చేసుకుని ప్రతిపక్ష రాజకీయాన్ని బలోపేతం చేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కీలకంగా స్వరం వినిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయ అంశాలపై వరుసగా స్పందిస్తున్నారు. యువతకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన జూలైలో డిమాండ్ చేశారు. అలాగే సెప్టెంబర్‌లో కేంద్ర రాజకీయాలపై కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో… సంక్షేమం, సామాజిక న్యాయం, రైతులు, బీసీలు, ప్రజా సంక్షేమం అంశాలను తన పాలనా రాజకీయానికి ప్రధానంగా చూపుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు హామీల అమలుపై విమర్శలు చేస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయ పోరాటం కొనసాగుతున్న వేళ… కేరళలో రేవంత్‌రెడ్డికి లభించిన ఈ అవార్డు ఆయన జాతీయ స్థాయి రాజకీయ ప్రొఫైల్‌కు మరో ప్రస్తావనగా మారింది.
కేరళ వేదికగా తెలంగాణ పాలనకు గుర్తింపు
ఆర్యదాన్ ముహమ్మద్ పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారం కేరళ వెలుపల నుంచి ఎంపికైన రేవంత్‌రెడ్డికి దక్కడం రెండు రాష్ట్రాల రాజకీయ సంబంధాల దృష్ట్యా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా రైతులు, వెనుకబడిన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను అవార్డు ఎంపికకు కారణాలుగా ఫౌండేషన్ పేర్కొనడం గమనార్హం. ఒక వైపు తెలంగాణలో పాలనపై ప్రతిపక్షాల దుష్ప్రచారం, మరోవైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వస్తున్న ప్రశంసలు కొనసాగుతున్న సమయంలో ఈ అవార్డు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.








