మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం!
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (Vivekananda Reddy) హత్య కేసు లావాదేవీల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ (Sunil Yadav) ఈడీ అధికారులు ఎదుట సంచలన విషయాలు వెల్లడించారు. హత్యకు సంబందించి కుదిరిన సుపారీ ఒప్పందం, నిధులు సమకూర్చిన వ్యవహారమంతా బయటపెట్టేందుకు సిద్ధపడిన ఆయన, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. రెండోరోజు విచారణకు హాజరైన సునీల్ యాదవ్ కేసులో ఆర్థిక లావాదేవీల రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పినట్లు తెలిసింది. అయితే, ఈ విషయాలు బయటకు పొక్కితే తన ప్రాణాలకు ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తం చేయగా, విచారణ విషయాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని ఈడీ ( ED) అధికారులు అతడికి అభయిచ్చారు.
అధికారుల నుంచి హామీ లభించడంతో సుపారీ డీల్, నిధులు సమకూర్చిన పెద్దల గురించిన పూర్తి సమాచారాన్ని సునీల్ యాదవ్ వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. పులివెందుల( Pulivendula)లో ఒక కీలక నేతకు ప్రధాన అనుచరుడిగా ఉన్న వ్యక్తి ద్వారానే ఈ ఆర్థిక లావాదేవీలన్నీ నడిచాయని, అవన్నీ నగదు రూపంలోనే సాగాయని సునీల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే తనకు రూ. కోటి చేరిన మాట వాస్తవమేనని, ఆ మొత్తాన్ని డ్రైవర్ దస్తగిరి(Driver Dastagiri)కి అందించినట్లు అంగీకరిస్తూ ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఈడీకి సమర్పించినట్లు సమాచారం.








