ఆదివారం రాత్రి మీరు చేసే ఈ చిన్న పని.. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి,విజేతను చేస్తుంది!
—శివ దువ్వూరు
ఒక్కసారి మీ సోమవారం ఉదయాన్ని గుర్తుతెచ్చుకోండి. ఆఫీస్‌కు వెళ్లగానే లేదా ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే మెయిల్స్, నోటిఫికేషన్లు, మీటింగ్‌లు..ఇది చాలదన్నట్లు వీటన్నింటి మధ్య “ఇది అర్జెంట్, అది అర్జెంట్” అంటూ ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతూనే ఉంటారు. ఏ పని ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో తెలియక తలపట్టుకుంటాం.
చూస్తూ ఉండగానే మంగళవారం ప్లాన్ మారిపోతుంది, బుధవారానికి సమయం సరిపోదు, గురువారం పరుగుల మీద పరుగెత్తుతాం. ఇక శుక్రవారం సాయంత్రానికి ఒక విచిత్రమైన అలసట మిగులుతుంది . అప్పుడు కాసేపు కూర్చుని.. “వారం మొత్తం ఇంత బిజీగా ఉన్నాను కదా, కానీ అసలు నేను సాధించిందేమిటి?” అని ఆలోచిస్తే…ఏమీ కనపడదు.. ఒక శూన్యమైన ప్రశ్న ఎదురుగా నిలబడుతుంది.
ఇలాంటి పరిస్ధితే ప్రతీ వారం వస్తే..అది ప్రతీ నెలకు కొనసాగితే..కొన్ని సంవత్సరాలు గడిచిపోతే…చివరకి జీవితాంతం కష్టపడినట్లే ఉంటుంది…దేనికి కష్టపడ్డామో..ఏం చేసామో తెలియదు..మీరు అనుకున్న పెండింగ్ పనులు అలాగే ఉండిపోతాయి. దీనికి పరిష్కారం లేదా అంటే..సింపుల్ అవును..చాలా చాలా సింపుల్ పరిష్కారం ఉంది.
అదేంటి
వాస్తవానికి అసలు సమస్య మనకి పని ఎక్కువ ఉండటంలో లేదు, వారం మొదలయ్యే ముందే ఆ వారం చివరికి ఏం సాధించాలో ఒక స్పష్టమైన విజన్‌ను మనం ముందే రాసుకోకపోవడంలోనే ఉంది.ఇది మాకూ తెలుసు అంటారా.దీనికి పరిష్కారం ఏమిటో చెప్పు అంటారా..
దీనికి పెద్ద పెద్ద మోటివేషనల్ సిద్ధాంతాలు, సంక్లిష్టమైన టైమ్ మేనేజ్మెంట్ పద్ధతులు ఏవీ అవసరం లేదు. చాలా సింపుల్‌గా, కేవలం మూడే మూడు అడుగుల్లో మన వారాన్ని మనమే కంట్రోల్ చేసుకునే ఒక అద్భుతమైన ఫ్రేమ్‌వర్క్ ఉంది. అదే ‘Win the Week’.
1. ఊహలతో కాదు.. ఆధారాలతో మొదలుపెడదాం
మనలో చాలామంది వారాన్ని కేవలం మన ఇష్టాయిష్టాలు లేదా ఊహల ఆధారంగా మొదలుపెడుతుంటాం. “ఈ వారం ఈ పని చేస్తే బాగుంటుంది ఏమో” లేదా “ముందుగా ఈ మీటింగ్ పూర్తి చేద్దాం” అనిపిస్తుంటుంది. కానీ ‘Win the Week’ చెప్పే మొదటి సూత్రం ఏమిటంటే… ఆలోచనల కంటే డేటా కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మన ప్రతి నిర్ణయం డేటా, దాని రిపోర్ట్‌లపైనే ఆధారపడి ఉండాలి.
గత వారం మనం ఎంతవరకు సాధించాం? ఏ పనులు వేగంగా ముందుకు వెళ్లాయి, ఎక్కడ బ్రేక్‌లు పడ్డాయి? వాటి ద్వారా మనం నేర్చుకున్న పాఠాలేమిటి? అనే విషయాలను ముందుగా స్పష్టంగా కొలవాలి. “ఈ వారం నేను ఏమేం పనులు చేయాలి?” అని అడగడానికి బదులుగా, “గత వారం ఫలితాల ఆధారంగా ఈ వారం నేను ఎలా దాన్ని ముగించాలి, ఆ పనిని ఎలా పూర్తి చేయాలి?” అని ప్రశ్నించుకోవడమే అసలైన విజేతల శైలి.
2. టైమ్ కోసం ఎదురుచూడొద్దు.. టైమ్‌ను ముందే ముడివేసేయండి
మన జీవితాల్లో ఒక అతి పెద్ద అబద్ధం ఏదైనా ఉందంటే.. అది “సమయం దొరికినప్పుడు ఆ ముఖ్యమైన పని పూర్తి చేస్తాను” అనుకోవడమే. ఎందుకంటే ఈ రోజుల్లో అలా దానంతట అదే దొరికే ‘ఖాలీ సమయం’ అనేది ఒక అరుదైన అవకాశం. అది ఎప్పటికీ జరగదు. పనులన్నీ పూర్తయ్యాక సమయం దొరుకుతుందేమో అని ఎదురుచూస్తే ఆ పని ఎప్పటికీ కాదు, పైగా మన వారం మొత్తం మన చేతుల్లోంచి జారిపోతుంది.
అందుకే రెండో సూత్రం చాలా క్లియర్: ఆ ముఖ్యమైన పనికి ముందే క్యాలెండర్లో సమయాన్ని లాక్ చేసేయాలి. అంటే ఆదివారం రాత్రే పోగ్రాం ఫిక్స్ చేసేయాలి. ప్లాన్ చేసుకోవాలి.
ఉదాహరణకు, మీకు అత్యంత ప్రాధాన్యమైన ఒక పనికి రెండు గంటలు పడుతుందంటే.. సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల సమయాన్ని ముందే రిజర్వ్ చేసేయండి. ఆ రెండు గంటల్లో ఏ ఇతర మీటింగ్స్, మెయిల్స్ లేదా డిస్ట్రాక్షన్స్కి చోటు ఉండకూడదు. సమయం దొరికే వరకు వేచి చూడకుండా, సమయాన్నే మన వైపు తిప్పుకోవడం ద్వారా మాత్రమే అనుకున్న ఫలితాలు సాధించగలం.
3. కథ క్లైమాక్స్‌ను ముందే రాసేద్దాం!
ఒక సూపర్ హిట్ సినిమాలో దర్శకుడికి క్లైమాక్స్ ఏంటో ముందే తెలుస్తుంది. హీరో ఎక్కడికి చేరుకోవాలి, కథ ఎలా ముగియాలి, థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు ప్రేక్షకుడు ఎలాంటి అనుభూతితో రావాలి అనేవన్నీ ముందే స్క్రిప్ట్‌పై రాసి ఉంటాయి. మన వారానికి కూడా సరిగ్గా ఇదే సూత్రాన్ని వర్తింపజేయాలి.
శుక్రవారం సాయంత్రం మీ బాస్కో లేదా మీకో మీరు సమర్పించుకునే ‘End-of-Week Report’ ఎలా ఉండాలో.. ఆదివారం రాత్రే రాసేయండి! ఈ వారంలో మీ టార్గెట్లు ఏవి సాధించారు, ఏ ఏ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి అనేది ముందుగానే రిపోర్ట్ రూపంలో రాసుకుని, ఆ తర్వాత వారం మొత్తం ఆ రిపోర్ట్‌ను నిజం చేయడానికి మాత్రమే పని చేయాలి. సాధారణ To-Do List అనేది “ఈ వారం ఏం చేయాలి?” అని అడిగితే, ఈ పద్ధతి “ఈ వారం చివరికి ఏం పూర్తి చేయాలి?” అని అడుగుతుంది. ఈ ఒక్క చిన్న ఆలోచనా విధానమే మీ ప్రొడక్టివిటీని పూర్తిగా మార్చేస్తుంది.
ముగింపు:
సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే చిన్న చిన్న సంఘటనలు, అత్యవసర పనులు మీ ప్లాన్‌ను రోజూ మార్చేస్తుంటే.. మీరు మీ వారాన్ని నడపడం లేదు, వారమే మిమ్మల్ని ఈడ్చుకెళ్తోంది. ‘Win the Week’ చెప్పే అసలు రహస్యం ఒక్కటే — “Design the win before the week begins.”
వారం ప్రారంభమైన తర్వాత గెలుపు కోసం వెతకడం కాకుండా, వారం మొదలయ్యే ముందే మీ గెలుపు ఎలా ఉండాలో మీరే డిజైన్ చేసుకోండి. అప్పుడు శుక్రవారం సాయంత్రం “ఈ వారం అసలు ఏం చేశాను?” అనే నిరాశ ఉండదు. ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం సోమవారం ఉదయమే మీరు రాసేశారు.. ఇక మిగిలిందల్లా దాన్ని నిజం చేసుకోవడమే!








