కోహ్లీ సంచలన ప్రకటన.. వన్డే రిటైర్మెంట్పై క్లారిటీ..!
భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ(Virat Kohli) తన వన్డే కెరీర్‌పై అత్యంత కీలకమైన ప్రకటన చేశాడు. ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ క్రికెట్లకు గుడ్‌బై చెప్పేసిన కోహ్లీ.. వన్డేల్లో తన భవిష్యత్తు ప్రణాళికలను అధికారికంగా వెల్లడించారు. బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ (JioStar) కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ మరియు తదుపరి లక్ష్యాలపై పూర్తి స్పష్టతనిచ్చారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల ఉమ్మడి ఆతిథ్యంలో వచ్చే ఏడాది (2027) జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీయే భారత్ తరఫున తాను ఆడబోయే చివరి ప్రపంచకప్ అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.
37 ఏళ్ల వయసున్న కోహ్లీ, ఈ మెగా టోర్నీతో తన సుదీర్ఘ ప్రపంచకప్ ప్రస్థానానికి ముగింపు పలకబోతున్నట్లు తేల్చిచెప్పారు. తన కెరీర్లో ఇది 5వ వన్డే ప్రపంచకప్ కానుంది. చివరి ప్రపంచకప్ కానుండటమే తనకు అతిపెద్ద మోటివేషన్ అని కోహ్లీ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. “2027 వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు నా శక్తి మేరకు కృషిచేస్తా. టీమిండియాను విజేతగా నిలబెట్టడానికి మైదానంలో నా సర్వస్వాన్ని ఒడ్డుతా. ట్రోఫీని ముద్దాడటమే నా ఏకైక ధ్యేయం. దానికోసం ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధం” అంటూ కోహ్లీ క్రికెట్ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు.
విదేశీ పిచ్‌లపై, భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో సుమారు 10 వన్డే మ్యాచ్‌ల పాటు ఒకే రకమైన హై-ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం శారీరకంగా, మానసికంగా ఎంతో సవాలుతో కూడుకున్నదని.. అయినప్పటికీ భారత్‌కు కప్పు తేవడమే లక్ష్యంగా తాను సిద్ధమవుతున్నట్లు కింగ్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశారు. కోహ్లీ చేసిన ఈ ప్రకటనతో 2027 వరల్డ్ కప్‌ను టీమిండియా ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోబోతోందో అర్థమవుతోంది.








