”వేద” స్వర – “కల్పద్రుమ” నృత్యార్చనలతో అలరించిన అన్నమయ్యపురం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో స్వర–నృత్యార్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు వేద సంకీర్తనాలయ ఆధ్వర్యంలో, 6 గంటలకు కల్పద్రుమ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సాయంత్రం 5 గంటలకు వేద సంకీర్తనాలయ గురువు శ్రీమతి రమణి జంధ్యాల గారి మార్గదర్శకత్వంలో శిష్యులు ఆరాధ్య, శ్రేష్ఠ, శ్రేయన్వి పెనుకొండ, ప్రణ్వ్య, ఎం.ఎల్. హర్షిణి, చోషిత బందన, సీర్షిత బందన, గుండబట్టుల మౌనిక, బి. నిహారిక, అమేయ, పి. శ్రీత, మారుతి, కాత్యశ్రీ, శ్వేత అభినయి, ఈషాధ్య అభినయి, మాన్వి తిరుమల, శామలి, ఎస్. శ్రీ భవిష్య, ప్రగతి అర్జున్, లాస్య తదితరులు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి భక్తిపూర్వక స్వరార్చన సమర్పించారు.
ఈ సందర్భంగా “శ్రీ విఘ్నరాజం భజే, శంకర పూజితే శారదే, వేడుకొందామా, జగడపు చనువుల జాజరా, సతులాలా చూడరే, గురుతెరిగిన దొంగ, శ్రీమన్నారాయణ, కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ, ఏకడి మానుష జన్మం, గోవింద గోవింద, తందనానాహి, తిరు తిరు జవరాల, అదివో అల్లదివో, ఇందిరా రమణు తెచ్చి, వేదంబెవ్వని వెతకడిది” వంటి అన్నమాచార్య సంకీర్తనలను శ్రుతి–లయ సమన్వయంతో ఆలపించి భక్తులను భక్తిరసంలో ముంచెత్తారు. ఈ స్వరార్చనకు మామిళ్లపల్లి వేదాంత దేశికన్ మృదంగంపై, బొండపల్లి మురళీధర రావు వయోలిన్పై వాయిద్య సహకారం అందించి గానానికి మరింత మాధుర్యాన్ని చేకూర్చారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు కల్పద్రుమ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ గురువు శ్రీమతి వల్లీ వసంతం గారి మార్గదర్శకత్వంలో శిష్యులు శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి భక్తిపూర్వక నృత్యార్చన సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎన్. వాగ్వేధ, యు. దేవశ్రీ, ఎస్.వి.ఎస్.ఎస్. మమత, బి. దివ్య, ఎం. మానస్వి, ఎస్. ముగ్ధ, లోకజ్ఞ, వి. చందన, వి. హరిప్రియ, పి. దిత్య, బి. హిమాన్షి బాయి, కె. అనన్య, డి. అన్విత సాయి శ్రీ, జి. ఆయుష్రీ, కె. గౌతమి, ఎ. యశశ్రీ, జి. కృతిక, జి. మోక్ష, ఎం. నిక్షిప్త సేత్తి సంయుక్తంగా “వినాయక స్తుతి, అదివో అల్లదివో, బ్రహ్మ కడిగిన పాదము, ముద్దుగారే యశోద, జగడపు చనువుల, ఒకపరి ఒకపరి, పలుకే బంగారమాయెరా, భో శంభో” వంటి భక్తిరసభరితమైన నృత్యాంశాలను భావ, లయ, అభినయ సమన్వయంతో ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. అన్నమయ్య సంకీర్తనలలోని భక్తిభావాన్ని నృత్యరూపంలో ఆవిష్కరించిన కళాకారుల ప్రదర్శనలు అన్నమయ్యపురానికి మరింత శోభను చేకూర్చాయి.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న గురువులు, గాయకులు, నృత్య కళాకారులను అభినందించి, శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో, భక్తి, సంగీత, నాట్య వైభవంతో విజయవంతంగా ముగిశాయి.








