ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ..! పాదయాత్రతో కొత్త గేమ్!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో సరికొత్త సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. ఫిరాయింపుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లోకి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత వ్యూహాత్మక రీతిలో ఎంట్రీ ఇచ్చారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతుందని ఆమె ప్రకటించారు. కేవలం ఎన్నికల బరిలో నిలవడమే కాకుండా, ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేపడతామని ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించారు.
ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, రాజకీయ స్వార్థం కోసం పార్టీ మారి ఎంపీగా పోటీ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని దానం నాగేందర్ పై కవిత మండిపడ్డారు. ఫిరాయింపు నేతలకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయడం ద్వారా.. కొత్త పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడమే ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తన పార్టీని నిలబెట్టేందుకు ఖైరతాబాద్ ఉపఎన్నికను ఆమె ఒక లిట్మస్ టెస్ట్‌గా భావిస్తున్నారు.
మరోవైపు… వచ్చే వేసవికాలంలో పాదయాత్ర చేపట్టబోతున్నట్టు కవిత ప్రకటించారు. తన మొదటి మీటింగ్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించారు. తన పాదయాత్ర కోసం బస్సు సిద్ధమవుతోందని.. దాని భైరవ అని పేరు పెట్టినట్లు కవిత తెలిపారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారని, అందుకే వాళ్లను లైట్ తీసుకున్నానని వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తనను బయట తిరగకుండా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. 2027 దసరాకు బతుకమ్మను గిన్నీస్ రికార్డుల్లోకి ఎకిస్తానని కవిత తెలిపారు.
ఇక కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కవిత తీవ్రంగా ప్రశ్నించారు. క్లరికల్ లోపాలు, సాంకేతిక కారణాల పేరుతో అర్హులైన ఓట్లను తొలగించడం వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లబ్ధి చేకూర్చే కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు వెంటనే రంగంలోకి దిగి హాస్టళ్లు, ప్రభుత్వ దవాఖానలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులు ప్రతి జిల్లాలోని ఆసుపత్రులను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి వాస్తవాలను వెలికితీస్తారని స్పష్టం చేశారు.
తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలను కవిత ఖండించారు. తన భూమి ఎలాంటి కబ్జా కిందకు రాదని, అది ఇనాం కానీ అసైన్డ్ భూమి కానీ కాదని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో తన భూములు లేవని, ప్రతి ఒక్క ఆస్తి వివరాలను ఎన్నికల అఫిడవిట్లలో పారదర్శకంగా వెల్లడించానని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై, ఇతర విపక్షాలపై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల ఫామ్‌హౌస్‌లకు వెళ్లిన ప్రముఖులు అప్పట్లో ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.
సొంత రాజకీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు ఖైరతాబాద్ ఉపఎన్నికను వేదికగా మలుచుకున్న కవిత, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి పాలక కాంగ్రెస్ వైఫల్యాలను, ఫిరాయింపుదారుల నైజాన్ని ఎండగట్టాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఖైరతాబాద్ బరిలో త్రిముఖ లేదా బహుముఖ పోటీకి దారితీసి తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టించే అవకాశముంది.








