మెగాస్టార్ కొత్త బిజినెస్.. సంక్రాంతికి షురూ!
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాదు.. ఇప్పుడు సినిమా ప్రదర్శన రంగంలోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఏషియన్ సినిమాస్(Asian cinemas)తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్త ఇప్పటికే ఆసక్తిని పెంచగా, ఈ భాగస్వామ్యానికి సంబంధించిన కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ స్థాయిలో కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ పూర్తవడానికి మరికొంత సమయం పట్టనుంది.
అయితే అంతకంటే ముందే ప్రేక్షకులకు మెగాస్టార్ బ్రాండ్‌తో కూడిన థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందుబాటులోకి రానుంది. కుషాయిగూడలోని తల్లూరి థియేటర్స్‌ను ఏషియన్ సినిమాస్, చిరంజీవి కలిసి కొత్త రూపంలో తీర్చిదిద్దుతున్నారు. దీనికి ఏషియన్ మెగాస్టార్ సినీప్లెక్స్(Asian megastar cineplex) అనే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి 2027 నుంచి ఈ సినీప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలనే టార్గెట్ తో వర్క్స్ జరుగుతున్నాయి. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది.
టాలీవుడ్లో ప్రముఖ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ రంగాన్ని విస్తరిస్తున్న ఏషియన్ సినిమాస్ లిస్ట్ లో ఇప్పుడు చిరంజీవి కూడా చేరుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు(mahesh babu), అల్లు అర్జున్(allu arjun), రవితేజ(raviteja), విజయ్ దేవరకొండ(Vijay devarakonda) వంటి స్టార్లతో భాగస్వామ్యాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి ఎంట్రీతో థియేటర్ బిజినెస్‌లో మరో ఆసక్తికరమైన స్టార్ బ్రాండింగ్ కలయికకు తెరలేచినట్లయింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో ఏషియన్ మెగాస్టార్ సినీప్లెక్స్ ప్రారంభం కావడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.








