ఎట్టకేలకు మేడిగడ్డ పునరుద్ధరణ.. రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో కొంతకాలంగా రగిలిపోతున్న ప్రధాన అంశాలలో మేడిగడ్డ ఒకటి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీలలో మేడిగడ్డ ఒకటి. అయితే ఇది కుంగిపోవడంతో రాజకీయ వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తునకు ఆదేశించింది. అయితే మేడిగడ్డను పునరుద్ధరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని, కేవలం బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బద్నాం చేయడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఈ విమర్శలకు చెక్ పెడుతూ ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ దిశగా కీలక అడుగులు వేసింది.
మేడిగడ్డ కుంగుబాటు కేవలం ఇంజనీరింగ్ వైఫల్యమా లేక రాజకీయ కుట్రల ఫలితమా అనే చర్చ గత రెండేళ్లుగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. బ్యారేజ్ కుంగిన వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనిని కేవలం సాంకేతిక లోపంగా, ప్రకృతి విపత్తుగా అభివర్ణించింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిని అవినీతి కట్టడంగా విమర్శించింది. బ్యారేజ్‌ను బాగుచేయకపోతే రాష్ట్రానికి తాగు, సాగునీటి కష్టాలు తప్పవంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చింది. అయినా ప్రాజెక్టు పునరుద్ధరణపై ఇన్నాళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు పునరుద్ధరణ పనులకు నడుం బిగించింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు, ఐఐటీ బాంబే నిపుణులు, అంతర్జాతీయ కన్సల్టెన్సీల సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభుత్వం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లకు కూడా సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. బ్యారేజ్ మొత్తం వెడల్పు మేరకు ఎండ్ టు ఎండ్ డయాఫ్రమ్ వాల్ నిర్మించి, పునాది భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా వరద ఉధృతిని నియంత్రించడానికి దిగువన ఉన్న స్టిల్లింగ్ బేసిన్లను బలోపేతం చేయనున్నారు. ఈ పనులను రాబోయే వర్షాకాలం లోపే.. అంటే 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దెబ్బతిన్న నిర్మాణాలను పునరుద్ధరించడం సాంకేతికంగా క్లిష్టమైనప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వెనుకంజ వేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. మేడిగడ్డను వదిలేశారు.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవట్లేదు.. అనే బీఆర్ఎస్ విమర్శలకు ప్రభుత్వ నిర్ణయం గట్టి సమాధానం ఇస్తుంది. ప్రాజెక్టుల పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని, కేవలం అవినీతి బండారాన్ని బట్టబయలు చేయడమే తమ ఉద్దేశమని చాటిచెప్పినట్లయింది. ప్రజలకు ఉపయోగపడేలా శాశ్వత పరిష్కారాలు చూపుతున్నామని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇది గొప్ప అవకాశంగా మారింది. రాజకీయ లబ్ధి కోసం కాలయాపన చేస్తున్నారన్న అపవాదును తొలగించుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ సఫలమైందనే చెప్పాలి.








