ఉక్రెయిన్ యుద్దంపై చేతులెత్తేసిన ట్రంప్..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా ఇక ఏమీ చేయలేదా.. పుతిన్ తో మాట్లాడి సెటిల్ చేసుకోవాల్సింది ఉక్రెయిన్ అధ్యక్షుడేనా.. లేటెస్టుగా ట్రంప్ కామెంట్స్ చూస్తుంటే అదే అర్థమవుతుంది. లేటెస్టుగా ట్రంప్ కీలక కామెంట్లు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin)తో మాట్లాడి త్వరలో ఓ ఒప్పందానికి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జెలెన్స్కీతో భేటీపై మీడియా వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఇన్నేళ్లుగా పుతిన్, జెలెన్స్కీ సర్దుకుపోతూ వస్తున్నారు. త్వరలోనే వారు ఓ ఒప్పందానికి రావచ్చు. శీతాకాలానికి ముందే ఈ విషయంపై ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే యుద్ధాన్ని ముగించాలని జెలెన్స్కీ బలంగా కోరుకుంటున్నారు’ అని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. మరోవైపు తమ దేశంపై రష్యా దురాక్రమణను అంతం చేయడానికి వైట్‌హౌస్ సాయం చేస్తోందని తాను విశ్వసిస్తున్నట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఆంక్షలు, వాణిజ్య పరిమితుల ద్వారా రష్యాకు వచ్చే ఆదాయాన్ని నిలిపివేయాలని.. తద్వారా యుద్ధాన్ని పొడిగించడానికి మాస్కోకు అవసరమైన డబ్బును అందకుండా చేయాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు.
యుద్ధం ముగింపు కోసం ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు కీవ్, మాస్కో పరస్పర దాడులు కొనసాగిస్తున్నాయి. శనివారం రాత్రి ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు (Russian attacks) చేయడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాలు దెబ్బతినడంతో ఆస్తి నష్టం సంభవించింది. కీవ్‌లోని మొబైల్ ఇంటర్నెట్ సేవలు, స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ల కోసం పనిచేసే ఓ డేటా సెంటర్ సైతం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్, రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Russian oil refineries).. పారిశ్రామిక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఈ డ్రోన్ దాడుల్లో ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడ్డారు








