క్రిస్మస్ రేసులో సీనియర్ హీరోల పోటీ
క్రిస్మస్ సీజన్‌కు టాలీవుడ్లో పోటీ ఇప్పటినుంచే ఆసక్తికరంగా మారుతోంది. ఈసారి బాక్సాఫీస్ బరిలో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) దాదా(dada), నాగార్జున(nagarjuna) కింగ్100(king100) సినిమాలు డిసెంబర్ 24న రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో క్రిస్మస్ సెలవులపై రెండు సినిమాల కన్ను పడింది. అయితే లాస్ట్ మినిట్ లో ఏదైనా మూవీ రిలీజ్ డేట్ ను మార్చుకుంటుందా, లేక ఇద్దరూ ఒకే రోజున బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం గాయంతో విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ అక్టోబర్‌లో షూటింగ్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నారు. మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను ఫాస్ట్ గా పూర్తి చేసి డిసెంబర్ 24న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు నాగార్జున 100వ సినిమాగా రూపొందుతున్న కింగ్100 కూడా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంది. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది.
రెండు సినిమాల రిలీజ్ డేట్ ఒకటే కావడంతో ఇప్పుడు అసలు డిస్కషన్ రిలీజ్ డేట్ చుట్టూనే సాగుతోంది. క్రిస్మస్ సీజన్లో థియేటర్లకు వచ్చే సినిమాలకు సెలవుల అడ్వాంటేజ్ కీలకంగా ఉంటుంది. అందుకే రెండు సినిమాల టీమ్స్ కూడా తమ వర్క్స్ ను నిర్ణీత గడువులో పూర్తి చేయడంపై దృష్టి పెట్టాయి. వీటితో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా క్రిస్మస్ బరిలో నిలవనున్నాయి. దీంతో డిసెంబర్ చివరి వారం టాలీవుడ్లో పోటీ మరింత పెరిగే అవకాశముంది. చివరికి దాదా, కింగ్100 ఒకే రోజు వస్తాయా, లేక ఒక సినిమా వెనక్కి తగ్గుతుందా అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.








