మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార (Fishermen) కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి యాభై కిలోల బియ్యం ( Rice) ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాంధ్ర వరదలు మరియు భారీ వర్షాల పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. కాకినాడ నుంచి వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు ఒడిశా (Odisha) పారాదీప్ ప్రాంతానికి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వర్షపాత లోటు తగ్గినప్పటికీ నదుల్లోకి వరద ప్రవాహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) కూడా ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సమగ్ర చర్యల ద్వారా వరద బాధితులకు మరియు మత్స్యకార కుటుంబాలకు త్వరగా ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.








