ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!
2015 మే 31న తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. ఆ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర నిందితులకు అప్పీలేట్ ట్రిబ్యునల్ ఊరటనిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ జప్తు చేసిన రూ.50 లక్షల అటాచ్మెంట్ ఉత్తర్వులను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రూ.5 కోట్ల లంచం ఆఫర్లో భాగంగా రూ. 50 లక్షల అడ్వాన్స్ మొత్తాన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ట్రయల్ కోర్టు కస్టడీకి అప్పగించారని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. నేరానికి సంబంధించిన ఆ సొమ్ము ఇప్పటికే కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు, ఈడీ మళ్లీ అదే మొత్తానికి సమానమైన ఆస్తులను లేదా నిధులను అటాచ్ చేయడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
2015లో రాజకీయాలను కుదిపేసిన ఈ ఉదంతం, నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. నాటి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎల్విస్ స్టీవెన్సన్కు ఓటు వేయడం కోసం రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీకి దొరికిపోయారు. ఆ తర్వాత కాలంలో రాజకీయ సమీకరణాలు మారి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయడం, పీసీసీ అధ్యక్షుడిగా మారడం, ఆపై రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి కావడం జరిగాయి.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఈ పాత కేసులోని ఈడీ అటాచ్‌మెంట్‌పై అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ తీర్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈడీ జరిపిన ప్రొవిజనల్ అటాచ్‌మెంట్‌ను ఢిల్లీ కేంద్రంగా ఉన్న జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారి నేతృత్వంలోని ట్రిబ్యునల్ తప్పుపట్టింది. లంచం సొమ్ము ఇప్పటికే కోర్టు ఆధీనంలో ఉన్నప్పుడు, నిందితులు ఆ నిధులను వేరే విధంగా మళ్లించే అవకాశం లేనందున ఈడీ చర్య చెల్లదని తేల్చిచెప్పింది. ఈ కేసులో అప్పట్లో రేవంత్ రెడ్డితో పాటు వేం కృష్ణ కీర్తన్ రెడ్డి (వేం నరేందర్ రెడ్డి కుమారుడు), రుద్ర శివకుమార్ ఉదయ్ సింహా, బిషప్ హ్యారీ సెబాస్టియన్ తదితరులు నిందితులుగా ఉన్నారు.
ఏదేమైనప్పటికీ, ఒక దశాబ్దం కిందట ప్రారంభమైన ఈ ఓటుకు నోటు ఉదంతం ఇప్పటికీ అటు న్యాయస్థానాల్లోనూ, ఇటు రాజకీయ వేదికలపై నిత్యం నానుతూనే ఉంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి








