విదేశాల్లోనూ భారతీయ సంస్కృతిని ఎన్నారైలు కాపాడుతున్నారు: రాంచందర్ రావు
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాస తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆటా మహాసభలకు హైదరాబాద్ నుండి విచ్చేసిన బీజేపీ నాయకులతో పాటు స్థానిక బీజేపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు రాజు, కొంపల్లి శ్రీనివాస్, విజయ్, శ్రీకాంత్, శరద్, విలాస్, సంతోష్, వాసుదేవ్ తదితరులను ఆయన పేరు పేరునా అభినందించారు. ప్రవాస భారతీయులకు అమెరికా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు బలపడటంలో, అలాగే ప్రపంచ శాంతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆయన గుర్తు చేశారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకు వచ్చి ఉన్నత స్థానాల్లో, మన భారతీయతను , మాతృభాషా సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోకుండా తెలుగు జాతి గర్వపడేలా ప్రవాసులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు.








