రొటీన్ కమర్షియల్ కథ ‘శ్రీనివాస మంగాపురం’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : చందమామ కథలు పిక్చర్స్ LLP.,
నటీనటులు: జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, డా.మోహన్ బాబు, వి కే నరేష్,
బ్రహ్మాజీ, శ్యామ్, దయానంద్ రెడ్డి, వాసుకి తదితరులు నటించారు.
సంగీతం: జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ : జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్స్కుటివ్ నిర్మాత : సాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్, సమర్పణ: సి.అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్, రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
విడుదల తేది :30.07.2026
నిడివి : 2 ఘంటల 35 నిముషాలు
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న, రమేష్ కుమారుడు ఘట్టమనేని మూడో తరంలో జై కృష్ణ ఘట్టమనేని (JAI KRISHNA)టాలివుడ్ హీరోగా పరిచయమైనా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం'(SRINIVASA MANGAPURAM) సూపర్‌స్టార్ మహేష్ బాబును రాజకుమారుడు చిత్రం తో పరిచయం చేసిన సి. అశ్వనిదత్ ఈ చిత్రానికి సమర్పకులు కావడం విశేషం. ప్రేమకథలకు కొత్త కోణం చూపించాలనే ప్రయత్నం చేసే దర్శకుల్లో అజయ్ భూపతి(AJAY BHUPATHI) ఒకరు. ఈసారి ఆయన తెరకెక్కించిన ‘శ్రీనివాస మంగాపురం’ కూడా ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాల కలయికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరోయిన్ గా రాషా తడానీ (RASHA TADANI)నటించిన ఈ చిత్రం చందమామ కథలు బ్యానర్ పై పి.కిరణ్ నిర్మించారు. తిరుపతి-బళ్లారి బ్యాక్‌డ్రాప్, మాస్ ఎలిమెంట్స్, ప్రేమకథ కలయికతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
తిరుపతిలో పెద్దిరెడ్డి(శ్యామ్) అంటే అందరికి హడల్. తేడాలు వస్తే తలకాయలు తీసే బ్యాచ్. తమ మనుషుల అమ్మాయిని ప్రేమించాడని ఒకడిని చితకబాదుతారు. ఇది చూసి శ్రీను(జై కృష్ణ) షాక్ అవుతాడు. పెద్ది రెడ్డి ఎంత డేంజరో తెలుసుకుంటాడు. శ్రీవారి వేడుకలో ఆయన కూతురు మంగా(రాషా తడాని)ని చూసి ప్రేమలో పడతాడు. రోజూ ఆమె వెంటపడతాడు. ఆమె చిరాకు పడ్డా వదలడు. ఆమె థియేటర్స్ నేర్చుకుంటుంది. నాటకాల్లో మంగా సరిగ్గా డైలాగ్ చెప్పలేకపోవడంతో శ్రీను హెల్ప్ చేస్తాడు. ఈ క్రమంలో ఆమెని ప్రేమలో పడేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తాడు. కానీ అప్పటికే మంగాకి పెళ్లి కుదురుతుంది. ఎంగేజ్ మెంట్‌కి కూడా వెళ్తాడు. మరికొన్ని రోజుల్లో పెళ్లి.. తన పుట్టిన రోజు తిరుపతి సమీపంలోని కొండపైకి తీసుకెళ్లి తన ప్రేమని వ్యక్తం చేస్తాడు శ్రీను. కానీ దీన్ని ఆమె తిరస్కరిస్తుంది. ఛీ కొడుతుంది. అయితే మంగని శ్రీను ఇబ్బంది పెట్టడాన్ని పెద్ది రెడ్డి తమ్ముడు చూస్తాడు. అతన్ని కొట్టి కారులో తీసుకొని వెళ్తుండగా, కొందరు ఎటాక్ చేస్తారు. ఆ దాడిలో పెద్ది రెడ్డి తమ్ముడిని శ్రీను కాపాడతాడు. దీంతో శ్రీనుని ఏం చేయకుండా వదిలేస్తారు. అయితే అప్పుడే పెద్ది రెడ్డి చెల్లి(వాసుకి)కి ఈ విషయం తెలుస్తుంది. దీంతో వెళ్లి శ్రీను బెదిరిస్తుంది. మంగాని వదిలేయమని చెబుతుంది. ఈ క్రమంలో శ్రీనుని వాసుబాబు అని పిలుస్తుంది. మరి వాసు బాబు శ్రీనుగా ఎలా మారాడు? ఇంతకి వాసుబాబు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వాసుబాబుకి భళ్లారి జిల్లాకే పెద్ద అయిన వెంకటప్పయ్య నాయుడు(మోహన్ బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? శ్రీను అసలు తిరుపతి ఎందుకు వచ్చాడు? మంగా, శ్రీను లైఫ్‌లో ఏం జరిగింది? చివరికి వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందనేది సినిమా.
నటీ నటుల హవబవాలు :
జై కృష్ణ తొలి సినిమాతోనే మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కనబరిచాడు. యాక్షన్ సన్నివేశాలు, పాటల్లో అతని ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ సహజంగా ఉన్నప్పటికీ, భావోద్వేగ సన్నివేశాల్లో ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది. రాషా తడానీ తన పాత్రకు తగ్గట్టుగా కనిపించింది. స్క్రీన్‌పై ఆకట్టుకునే లుక్‌తో పాటు సహజమైన నటన చూపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దే అవకాశం కథలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు.మోహన్ బాబు పాత్ర సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన కనిపించిన ప్రతి సన్నివేశంలో తనదైన డైలాగ్ డెలివరీతో తనదైన ముద్ర వేశారు. అయితే పాత్రను రెండో భాగానికి మాత్రమే పరిమితం చేయడంతో ఆయన పాత్ర ప్రభావం కొంత తగ్గింది. కిక్ శ్యామ్ పోషించిన పెద్దిరెడ్డి పాత్రకు మంచి బిల్డప్ ఇచ్చినా, క్లైమాక్స్‌లో ఆ పాత్ర ముగింపు అంత బలంగా అనిపించదు. ఆర్కేస్ట్రా బాలుగా బ్రహ్మాజీ నవ్వించే ప్రయత్నం చేశాడు. స్వతంత్రబాబుగా నరేష్ రెచ్చిపోయాడు. హీరోయిన్ అత్తగా వాసుకి పాత్రలో ఒదిగిపోయింది. నెగటివ్ రోల్లో అజయ్ ఫర్వాలేదనిపించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
సాంకేతికవర్గం పనితీరు :
దర్శకుడు అజయ్ భూపతి `ఆర్ఎక్స్ 100`, `మంగళవారం`తో మెప్పించాడు. కానీ ఈ సినిమా విషయంలో తన మార్క్ కనిపించలేదు. రొటీన్ కమర్షియల్ మూవీ చేశాడు. ఏ సన్నివేశం ఇందులో బలంగా చూపించలేకపోయాడు. అన్నీ లైటర్‌వేలోనే టచ్ చేశాడు. సినిమా కథ రొటీన్‌గానే కాదు, కథనం కూడా రెగ్యూలర్‌గా ఉంటుంది. కొన్ని ట్విస్ట్ లు, ఫ్యామిలీ డ్రామా, ఎలివేషన్లు సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. కాకపోతే ట్విస్ట్ లు మరింత బలంగా రాసుకోవాల్సింది. లవ్ స్టోరీ ట్విస్ట్ లతో ఫర్వాలేదనిపించినా, ఇంకా ఎమోషనల్‌గా డిజైన్ చేయాల్సింది. దర్శకుడు సినిమాని రొటీన్‌గా నడిపించడంతో వచ్చి పోతున్నా ఎన్నో సినిమాల్లో ఇదొకటి అనే ఫీలింగ్ ని తెప్పిస్తుంది. హీరో పాత్రకి సంబంధించిన సీన్లు కూడా ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క పాట ఫర్వాలేదు. మిగిలినవి, రెగ్యూలర్ కమర్షియల్ సాంగ్స్ గానే ఉన్నాయి. పాటలు సినిమాకి ప్లస్ కాలేకపోయాయి. జయకృష్ణ గుమ్మడి కెమెరా వర్క్ బాగుంది. లాంగ్ షాట్స్ బాగా చూపించాడు. విజువల్స్ గా కలర్ఫుల్గా ఉంది. తన క్రియేటివిటీ కనిపించింది. మాధవ్ కుమారు గల్లపల్లి ఎడిటింగ్ ఇంకా చేయాల్సింది. సినిమాని కొత్త కత్తిరించవచ్చు. కొన్ని సీన్లలు ఆర్డర్ మిస్ అయిన ఫీలింగ్ ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి రిచ్గావుంది. అన్ని లైవ్ లొకేషన్స్ బాగున్నాయ్.
విశ్లేషణ :
‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ఇరవై ఏళ్లనాటి కథలనే పోలి ఉంటుంది. అదే స్టయిల్లో మూవీ సాగుతుంది. దర్శకుడు అజయ్ భూపతి ఈ విషయంలో సేఫ్ గేమ్ ఆడాడని చెప్పొచ్చు. ప్రారంభంలో రెగ్యూలర్ లవ్ ట్రాక్‌తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. విలన్ని పవర్‌ఫుల్‌గా చూపించడం కామనే. ఇందులోనూ అదే జరిగింది. ఆ తర్వాత హీరో.. హీరోయిన్ వెంటపడటం రొటీన్‌గానే వెళ్తుంది. కాకపోతే జై కృష్ణ ప్రజెన్స్ సర్ప్రైజింగ్గా ఉంటుంది. అతను తనదైన స్టయిల్లో చేసుకుంటూ వెళ్లారు. ఫస్టాఫ్ అంతా రెగ్యూలర్‌గానే సాగుతుంది. ఒక క్లీన్ కమర్షియల్ లవ్ స్టోరీగా కనిపిస్తుంది. ప్రేమ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచి సంగీతం, విజువల్స్, హీరో స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. అయితే కథనం, భావోద్వేగాలు మరింత బలంగా ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేదనే భావన కలుగుతుంది. అజయ్ భూపతి తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కంటెంట్‌కు దూరంగా కుటుంబ ప్రేక్షకులు కూడా చూడగలిగే ప్రేమకథను అందించే ప్రయత్నం చేశారు. ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూసే ఎంటర్టైనర్గా ఈ చిత్రం నిలుస్తుంది. జై కృష్ణ మాస్ ఎంట్రీకి సెట్ అయిన కమర్షియల్ సినిమాగా చెప్పొచ్చు.








