ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్!
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో నమోదైన భారీ అవినీతి, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో రేపటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రతిపక్ష బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర నిందితులు విచారణకు హాజరుకావాలని కోర్టు ఇప్పటికే జారీ చేసింది. దీంతో రేపటి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ-కార్ రేస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడం, ఇ-మొబిలిటీ వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో 2022 అక్టోబరులో తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా ఈ ఆపరేషన్స్, గ్రీన్ కో అనుబంధ సంస్థ ‘ఏస్ నెక్స్ట్ జెన్’ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11న సీజన్-9 ఫార్ములా ఈ రేసును నగరంలో విజయవంతంగా నిర్వహించారు.
అయితే, సీజన్-10 రేసు నిర్వహణ సమయానికి స్పాన్సర్ సంస్థ ఒప్పుకున్న బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వివాదం మొదలైంది. దాంతో హెచ్ఎండీఏను నేరుగా ప్రమోటర్‌గా మార్చి, చెల్లింపులను ప్రభుత్వం వైపు నుండి జరిపారు. తదుపరి డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనుమతులు లేని చెల్లింపులు, నిధుల దుర్వినియోగం జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ విచారణకు ఆదేశించింది. ర్జ్షీట్ ఆధారంగా ఏసీబీ ప్రత్యేక కోర్టు మే 14న ఐదుగురు ముఖ్యులకు సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో ఏ1గా అప్పటి పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఏ2గా నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఏ3 గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా ఫార్ములా ఈ ఆపరేషన్స్ – FEO ప్రతినిధి ఆల్బర్ట్ లొంగో ఉన్నారు.
ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, ముందస్తు నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కరెన్సీ రూపంలో పెద్ద మొత్తంలో నిధులను చెల్లించినట్లు ఏసీబీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే ఈ నిధుల బదిలీ జరిగిందని, ఇందులో తీవ్రమైన ‘క్విడ్ ప్రో కో’ చోటుచేసుకుందని పేర్కొంది. అంతేకాకుండా, ఈ ఒప్పందాలు, చెల్లింపులకు ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు మళ్లాయనే తీవ్రమైన అభియోగాలను కూడా ఏసీబీ నివేదికలో ప్రస్తావించింది.
ఈ ఆరోపణలను కేటీఆర్ మొదటి నుంచీ ఖండిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ ఇమేజ్ను ప్రపంచపటంలో నిలబెట్టేందుకు, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించే సదుద్దేశంతోనే రేసు నిర్వహణకు హెచ్ఎండీఏ ద్వారా నిధులు విడుదల చేశామని ఆయన స్పష్టం చేశారు. నిధుల బదిలీ ప్రక్రియ మాత్రమే జరిగిందని, అందులో ఎటువంటి అవినీతి లేదా వ్యక్తిగత లబ్ధి లేదని వాదించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ గతంలోనే ప్రకటించారు.
రేపటి నుంచి ఏసీబీ కోర్టులో ప్రారంభం కానున్న ఈ విచారణ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐఏఎస్ అధికారులతో పాటు ఒక అగ్రనేత నిందితుడిగా కోర్టు ముందుకు వస్తున్న ఈ కేసు తుది తీర్పు ఏ మలుపు తిరుగుతుందోనని యావత్ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.








