విద్యపై రేవంత్ మార్క్ మాస్టర్ ప్లాన్!
తెలంగాణ విద్యావ్యవస్థలో నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థపై తన విజన్ ను ఆవిష్కరించారు. విద్యారంగ సమగ్ర స్వరూపాన్ని మార్చేందుకు తన వద్ద ఉన్న కార్యాచరణను స్పష్టంగా వివరించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా, రాబోయే తరాల భవిష్యత్తే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన నొక్కి చెప్పారు.
గత పాలకులు ఇరిగేషన్ శాఖను తమ వద్ద ఉంచుకుని, వేల పుస్తకాలు చదివామని గొప్పలు చెప్పుకుంటూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. కానీ నేను మాత్రం ఓట్లు లేని, కేవలం బాధ్యత మాత్రమే ఉన్న విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని పరోక్షంగా విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. తానెలాంటి తప్పులు చేయలేదని, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు వివాదాల్లేకుండా పూర్తి చేశానని గుర్తుచేశారు. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, తెలంగాణ విద్యా వ్యవస్థ 28వ స్థానం నుండి 18వ స్థానానికి చేరుకుందని గణాంకాలతో సహా వెల్లడించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రులు రూ.50 వేలకు మించి ఖర్చు చేయడం లేదని, కానీ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.1.08 లక్షలు వెచ్చిస్తోందని సీఎం స్పష్టం చేశారు. బడ్జెట్లో విద్యకు 9 శాతం నిధులు కేటాయిస్తున్నప్పటికీ, నాణ్యతా ప్రమాణాల్లో ప్రపంచంతో పోటీ పడటంలో మనం ఎక్కడో వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ పూర్తయినా కనీసం ఉద్యోగానికి దరఖాస్తు కూడా రాయలేని పరిస్థితి మారి తీరాలని ఉద్ఘాటించారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చడమే కాకుండా, విదేశీ పర్యటనలకు ప్రతి ఏటా ఉపాధ్యాయులను పంపి గ్లోబల్ ఎడ్యుకేషన్‌ను ఇక్కడ అమలు చేస్తామన్నారు.
తనకు ఎలాంటి ఇతర కోరికలు లేవని, 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో మీకేమీ అనుమానాలు అక్కర్లేదన్నారు. నల్గొండ వంటి ప్రాంతాల్లో 9 మంది ఉపాధ్యాయులున్నా ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలల పరిస్థితిని నిరసించారు. బదిలీలు చేస్తే ధర్నాలు చేయడం సరికాదన్నారు. “మీ సమస్యలు నాకు వదిలేయండి.. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు మీ ఇంటికే వస్తాయి. కానీ ఐదేళ్ల పాటు పిల్లల భవిష్యత్తు కోసం నా దారిలోకి వచ్చి పోరాడండి. మండలాల వారీగా క్లస్టర్లను ఏర్పాటు చేసి, పాఠశాలల అభివృద్ధికి మీరే నివేదికలు ఇవ్వండి, వాటిని అమలు చేసే బాధ్యత నాది” అని పిలుపునిచ్చారు.
హాస్టల్ సంస్కృతి వల్ల పిల్లలు ఒంటరితనానికి గురై, భవిష్యత్తులో తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్‌లలో వేసే పరిస్థితి వస్తోందని రేవంత్ రెడ్డి మానవీయ కోణాన్ని స్పృశించారు. టీచర్లు కేవలం బోధకులుగా కాకుండా తల్లిదండ్రుల స్థానంలో ఉండి గైడ్ చేయాలని కోరారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనమేనని, జర్మనీ, జపాన్ లాంటి దేశాలపై దృష్టి సారించి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. “ప్రభుత్వ బడిలో చదివితే ఏమవుతావని ఎవరైనా అడిగితే.. తెలంగాణ సీఎం అవుతానని గర్వంగా చెప్పండి” అని వ్యాఖ్యానించి ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపారు.








