ఇరాన్ పై అమెరికా భీకర దాడులు.. జోర్డాన్ బేస్ లను టార్గెట్ చేసిన టెహ్రాన్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినట్లుగానే ఇరాన్ పై .. యూఎస్ ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. ఇరాన్ లోని కీలక టార్గెట్లపై అమెరికా విరుచుకుపడింది. అగ్రరాజ్యం దాడులతో ఇరాన్ దద్దరిల్లింది. జోర్డాన్‌లోని తమ స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా ఈ శక్తిమంతమైన దాడులు జరుగుతున్నాయని యూఎస్ మిలిటరీ వెల్లడించింది.
మరోవైపు.. జోర్డాన్‌లోని బేస్‌లపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. ‘‘మేం వారిని గట్టిగా దెబ్బకొడతాం’’ అని ప్రకటించారు. ఆ క్రమంలోనే దక్షిణ ఇరాన్ (Iran) లో శక్తిమంతమైన పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఖేష్మ్ ద్వీపాన్ని, అణువిద్యుత్ కేంద్రం ఉన్న తీరనగరం బుషెహర్‌ను అమెరికా సైన్యం టార్గెట్ చేసింది. ఖేష్మ్ ద్వీపంలో నివాస ప్రాంతాలపై క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది.
జోర్డాన్‌లోని ఎయిర్‌బేస్, కమాండ్ సెంటర్‌ను టార్గెట్ చేశామని ఐఆర్జీసీ వెల్లడించింది. అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం.. ఇరాన్ వైపు నుంచి ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను తాము అడ్డుకున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. తాము డజన్ల కొద్దీ ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లు పేర్కొంది.
ఇంతకాలం ఇరాన్, గల్ఫ్ దేశాలకే పరిమితమైన యుద్ధం బుధవారం మరో టర్న్ తీసుకుంది. ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్ట్‌లోని అమెరికాకు చెందిన గ్యాస్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి చేసింది (Drone hits gas tanker at Egypt port). దాంతో ఎల్ఎన్జీ లోడింగ్, ఇతర ప్రక్రియలు జరుగుతోన్న సమయంలో ఈ దాడి జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడి, వేగంగా మరో ట్యాంకర్‌కు విస్తరించాయి. దాంతో అత్యవసర సహాయక బృందాలు నావికులను అక్కడి నుంచి తరలించాయి. ఇంధన నిల్వలున్న మరో దేశానికి ఘర్షణలు విస్తరించడంతో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.








