స్ఫూర్తిదాయకం…అమిత్ కశ్యప్ అమెరికా జీవనం
ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన టెక్ నిపుణుడు, ప్రస్తుతం టెక్సాస్‌లోని డల్లాస్‌లో స్థిరపడిన అమిత్ కశ్యప్ తాను నేడు ఈ స్థితికి రావడం వెనుక తల్లితండ్రులు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. వారు చేసిన త్యాగాలకు ప్రతీకగా అమెరికాలో ఒక విలాసవంతమైన ఇల్లు (ఐలాండ్ హోమ్), బీఎండబ్ల్యు ఎక్స్-7 లగ్జరీ కారును వారికి కానుకగా ఇచ్చి తన ‘అమెరికన్ డ్రీమ’ను సాకారం చేసుకున్నారు. అమెరికాలో తాను సాధించిన విజయానికి కారణమైన తల్లిదండ్రులను ఇటీవల ఆయన అమెరికాకు ఆహ్వానించారు. ఇది వారి తొలి అంతర్జాతీయ ప్రయాణం. ఈ సందర్భంగా లాస్ వేగాస్, న్యూయార్క్ల్లోని ప్రసిద్ధ ప్రాంతాలను వారికి చూపించారు. న్యూయార్క్‌లోని అత్యంత ఎత్తైన ‘వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర’ భవనంలోని 104వ అంతస్తు నుంచి నగరం అందాలను, ఎత్తైన స్కైలైన్‌ను తన తల్లిదండ్రులు చూసి పసిపిల్లల్లా మురిసిపోయారని ఆయన తెలిపారు. పశ్చిమ అర్ధగోళంలోనే అత్యంత ఎత్తైన ఆ భవనం నుంచి వారు ఆశ్చర్యంగా చూస్తున్న క్షణాలను అమిత్ తన వీడియోలో బంధించారు.
అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని తన ఇన్ స్టాగ్రామ్‌లో అతను పంచుకున్నారు.అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొంత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్‌కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు.









