యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. బిల్లులో మార్పులు చేయాలంటూ విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించింది. పశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడడమే బిల్లు లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం అనంతరం లోక్‌సభ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా గురువారానికి వాయిదా వేశారు.
ఈ బిల్లుపై చర్చలో భాగంగా ఆయా పార్టీల సభ్యులు మాట్లాడిన తర్వాత.. కేంద్ర జితేంద్ర సింగ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్బంగా రాహుల్ పై తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాలపై రాహుల్ కి అవగాహనే లేదన్నారు.
మరో వైపు ఈ బిల్లు ప్రకారం.. పేపర్ లీకులకు పాల్పడే వారికి కనీసం ఐదేళ్లు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి కనిష్ఠంగా ఏడేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. కాగా, ఈ అక్రమాలపై దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. చార్జిషీటు దాఖలైన 3 నెలల్లో విచారణ పూర్తి చేయటానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో కేంద్రప్రభుత్వం పేపర్ లీక్ ఘటనల మీద దర్యాప్తు చేయించటానికి స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయటానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది.








