కేంద్ర ప్రభుత్వ అధికారులకు షాక్..!
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులను అరికట్టడంతో పాటు పన్ను చెల్లింపుదారుల సొమ్మును మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా “వన్ ఆఫీసర్, వన్ అఫీషియల్ కార్” విధానాన్ని తక్షణమే అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం.. అర్హులైన ఏ కేంద్ర ప్రభుత్వ అధికారి కూడా ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ వాహనాలను ఉపయోగించడానికి వీల్లేదు.
కేంద్ర వ్యయ శాఖ (Department of Expenditure) విడుదల చేసిన అధికారిక మెమోరాండం ప్రకారం, ఒక అధికారి అదనపు బాధ్యతల కింద ఒకటి కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) లేదా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల బాధ్యతలు చూస్తున్నప్పటికీ, వారికి రెండో అధికారిక కారును కేటాయించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఒక శాఖ తరపున కారు వాడుతున్న ఆఫీసర్ అదనపు బాధ్యతలు స్వీకరిస్తే, వారు అదే పాత వాహనాన్నే కొనసాగించాలి తప్ప, కొత్తగా బాధ్యతలు తీసుకున్న సంస్థల నుండి అదనపు వాహనాన్ని మంజూరు చేయరాదని తేల్చిచెప్పింది.
అలాగే అధికారిక పర్యటనలు లేదా టూర్ల నిమిత్తం తప్ప.. పిఎస్యూలు లేదా క్వాసి-గవర్నమెంట్ ఆర్గనైజేషన్లకు చెందిన వాహనాలను కేంద్ర అధికారులు తమ సొంత పనులకు వాడటాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నూతన నిబంధనల వల్ల వివిధ శాఖల్లో ఉపయోగించకుండా మిగిలిపోయిన లేదా అదనంగా ఉన్న సర్ప్లస్ వాహనాలను సురక్షితమైన కస్టడీలో ఉంచాలని, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనధికారిక అవసరాలకు వాడకుండా చూసుకోవాలని ఆయా డిపార్ట్మెంట్లకు ఆదేశాలు జారీ చేసారు.
గత 2022 సెప్టెంబర్‌లో రూపొందించిన స్టాఫ్ కార్ గైడ్‌లైన్స్‌ను మరింత కఠినతరం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం.. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే కాకుండా ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయనుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని వ్యయ శాఖ ఆదేశించింది.








