గూగుల్లోనే గూగుల్ ఏఐ ‘జెమినీ’ పై బ్యాన్: అసలు ఏం జరిగింది?!
సాంకేతిక ప్రపంచాన్ని ఏలుతున్న టెక్ దిగ్గజం గూగుల్. ప్రపంచమంతా ఎగబడేలా ‘జెమిని’ (Gemini) అనే అత్యాధునిక ఏఐ మోడల్‌ను తయారు చేసి మార్కెట్లోకి వదిలింది. కానీ, సరిగ్గా అదే సమయంలో గూగుల్ ఆఫీసు లోపల ఏం జరిగిందో తెలుసా? “ఎవరైనా వాడండి కానీ… మన ఇంజనీర్లు మాత్రం జెమినిని కోడింగ్ కోసం వాడటానికి వీల్లేదు!” అని కంపెనీ నిబంధన విధించింది.
వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది పక్కా నిజం! స్వయంగా గూగుల్ సహ వ్యవస్థాపకుడు (Co-founder) సెర్గీ బ్రిన్ (Sergey Brin) ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఈ విచిత్రమైన ఉదంతాన్ని బయటపెట్టారు.
నిషేధానికి అసలు కారణం ఏంటి?
సాధారణంగా ఏదైనా టూల్‌ను బ్యాన్ చేశారంటే… అందులో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయనో, లేదా అది సరిగ్గా పనిచేయడం లేదనో అనుకుంటాం. కానీ జెమిని విషయంలో జరిగింది అది కాదు!
పాత కాలపు రూల్: గూగుల్‌లో డెవలపర్లు వాడే కోడింగ్ టూల్స్ కోసం ఒక అంతర్గత జాబితా (Internal ‘No List’) ఉంటుంది. అందులో ఎప్పుడో “ఏదో ఒక పాత కారణం చేత” (Weird Historical Reasons) ఎవరో జెమినిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశారు.
అప్డేట్ చేయని వెబ్‌పేజీ: కాలం మారింది… జెమిని ప్రపంచంలోనే అత్యుత్తమ ఏఐ టూల్స్‌లో ఒకటిగా ఎదిగింది. కానీ, ఆ గూగుల్ ఇంటర్నల్ వెబ్‌పేజీని మాత్రం ఎవరూ అప్డేట్ చేయడం మర్చిపోయారు!
భయపడిన ఇంజనీర్లు: ఆ నిబంధన కాగితాలపై (సిస్టమ్‌లో) అలాగే ఉండిపోవడంతో… సాంకేతిక తలనొప్పులు ఎందుకని ఇంజనీర్లు సొంత కంపెనీ ఏఐని వాడకుండా పక్కన పెట్టేశారు.
వ్యవస్థాపకుడికే తప్పని తిప్పలు!
చాలాకాలం తర్వాత మళ్లీ కోడింగ్ చేయడానికి సిద్ధమైన సెర్గీ బ్రిన్, జెమినిని వాడదామని చూస్తే ఈ నిషేధపు బోర్డు కనిపించింది. కంపెనీలో బిలియన్ల కొద్దీ డాలర్ల షేర్లు, అపరిమితమైన అధికారాలు ఉన్న బ్రిన్కే ఈ పరిస్థితి చూసి దిమ్మతిరిగిపోయింది.
ఇక ఆ నిబంధనను ఎత్తేద్దామని ఆయన ప్రయత్నిస్తే… గూగుల్ లోపల ఉన్న టీమ్ తో ఆయనకు చుక్కలు కనపడ్డాయి. చిన్న మార్పు చేయడానికి కూడా వారాల తరబడి అంతర్గత అనుమతుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కింది స్థాయి అధికారులతో పనికాకపోవడంతో, చివరకు విసిగిపోయిన బ్రిన్ నేరుగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వద్దకు వెళ్లాల్సి వచ్చింది. సుందర్ పిచాయ్ జోక్యం చేసుకుని ఆ విచిత్రమైన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో కథ సుఖాంతమైంది.
ఇందులో దాగున్న అసలు మెసేజ్!
చాలా మంది అంటున్నట్లు ఒక రకంగా ఇది గూగుల్ బ్యూరోక్రసీలోని లోపాలను ఎత్తిచూపినప్పటికీ… సెర్గీ బ్రిన్ మాత్రం దీన్ని మరో కోణంలో విశ్లేషించారు. “కంపెనీ కో-ఫౌండర్ చెప్పినా సరే, రూల్ బుక్ చూపించి ప్రశ్నించే స్వేచ్ఛ గూగుల్ సంస్కృతిలో ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా, ప్రపంచానికే ఏఐ పాఠాలు చెప్తున్న ఒక టెక్ దిగ్గజం… తన సొంత ప్రాడక్ట్‌ను ఆఫీస్ లోపల వాడుకోవడానికి కంపెనీ బాస్‌లే పోరాటం చేయాల్సి రావడం నిజంగా గ్రేట్ ఐరనీనే!








