అమరావతిలో దేశంలోనే తొలి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ విధానం..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా వైద్య రంగంలో ఒక సరికొత్త విప్లవాత్మక అడుగు పడింది. అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ మరియు బయోటెక్ దిగ్గజ సంస్థలైన ‘ఆస్ట్రాజెనెకా’ (AstraZeneca), ‘స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్’, మరియు ‘క్యూర్ ఏఐ’ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక “ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ” విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ దిగ్గజం ‘ఆస్ట్రాజెనెకా ఇండియా’ రాష్ట్రంలో ఒక అధునాతన “ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్”ను ఏర్పాటు చేయనుంది. నేటి సమాజంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ, ప్రాణాంతకంగా మారుతున్న ఊపిరితిత్తుల మరియు రొమ్ము క్యాన్సర్ బాధితులకు ఈ కేంద్రం ద్వారా ఎంతో మేలు జరగనుంది. క్యాన్సర్ రోగుల కోసం అత్యంత అధునాతన జన్యు పరీక్షలు మరియు బయోమార్కర్ టెస్టింగ్ నిర్వహించడానికి ఈ సెంటర్ అదునాతన వేదికగా నిలవనుంది. దీని ద్వారా క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి, రోగి శరీర తత్వానికి అనుగుణంగా సరైన చికిత్స అందించే అవకాశం లభిస్తుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరికీ కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలను, అంతర్జాతీయ స్థాయి చికిత్సా విధానాలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు ఇలాంటి సాంకేతిక భాగస్వామ్యాలు ఎంతో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు అమరావతిలో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్‌గా ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని రాజకీయ, వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి.








