విద్యార్థులపై బల ప్రయోగం ఎందుకు? సభలో ఏకిపారేసిన విపక్షాలు
నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు. వారిపై టియర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించారు.. అలాగే విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ కేంద్రానికి ప్రియాంక గాంధీ వరుసగా ప్రశ్నలు సంధించారు.యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. అసలు విద్యార్థుల నిరసనను అణచివేయమని ఎవరు చెప్పారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
గౌరవ్ గోగోయ్
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ కూడా చర్చ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా యువత పోరాటం చేస్తుంటే మోదీ మాత్రం రీల్స్ చేస్తూ కూర్చొన్నారని మండిపడ్డారు. సమస్యలపై కాకుండా ఇన్ స్టా పై ఆయన దృష్టి పెట్టారన్నారు. లీకేజీ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదని మండిపడ్డారు. అసలు అర్థవంతమైన మార్పును ప్రభుత్వం కోరుకోవడం లేదని విమర్శించారు. అలాగే పాక్ తో యుద్ధం గెలిచి వచ్చారా; ఎందుకు అంతలా సన్మానం చేశారని ప్రశ్నించారు.
అఖిలేష్ యాదవ్
ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తప్పించి, ప్రధాని మోదీని బీజేపీ కాపాడిందని సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేలా ఒత్తిడి తెచ్చిన యువత నిరసనలను ప్రశంసించారు.పేపర్ లీకేజీ వివాదంపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలు, జెన్ జీ ఉద్యమమే మోదీ సర్కార్ మెడలు వంచిందన్నారు. ప్రజా ఒత్తిడికి తలొగ్గే ప్రధాన్ చేత రాజీనామా చేయించాల్సి వచ్చిందన్నారు. ఎగ్జామ్ పేపర్లు, విరాళాల చోరీలు కామన్ మారాయని దెప్పిపొడిచారు.








