‘మినిమమ్ బ్యాలెన్స్’ పేరుతో రూ.7,000 కోట్లు వసూలు చేసిన బ్యాంకులు! మీరూ ఈ లెక్కలో ఉన్నారా?
సాధారణంగా బ్యాంకులు మనం ఇచ్చే లోన్ల మీద కట్టే వడ్డీలతోనూ, ఇతర సర్వీస్ ఛార్జీలతోనూ సంపాదిస్తాయని మనకు తెలుసు. కానీ… మన అకౌంట్లో ఉండాల్సినంత డబ్బు లేనందుకే బ్యాంకులు ఏటా వేల కోట్లు ఆర్జిస్తున్నాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.
ఏ రకమైన అప్పు తీసుకోకపోయినా, ఈఎమ్ఐ ఎగవేత లేకపోయినా, చివరికి క్రెడిట్ కార్డు అసలు వాడకపోయినా సరే… కేవలం అకౌంట్లో ‘మినిమమ్ బ్యాలెన్స్’ మెయింటైన్ చేయలేదనే కారణంతోనే మన దేశంలోని బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.7,000 కోట్లకు పైగా వసూలు చేశాయి!
స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో వెల్లడించిన అధికారిక గణాంకాలివి. ఇందులో ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే… ఈ రూ.7,000 కోట్లలో దాదాపు రూ.5,000 కోట్లు కేవలం ప్రైవేట్ బ్యాంకుల నుంచే వచ్చాయి.
ఒక్కో ఖాతాదారుడి దృష్టి నుంచి చూస్తే నెలకు రూ.200 లేదా రూ.500 కట్ కావడం చిన్న విషయమే కావచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది అకౌంట్ల నుంచి ఇలా నిశ్శబ్దంగా జారే ఆ చిన్న మొత్తాలే… బ్యాంకులకు వేల కోట్ల ఆదాయ మార్గంగా మారుతున్నాయి.
అప్పు చేయకపోయినా… ఖాతాలో కోత ఎందుకు? అసలు ఈ డబ్బు బ్యాంకుల ఖాతాలోకి ఎలా వెళ్తుంది?
సాధారణంగా మనం సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా తెరిచినప్పుడు బ్యాంకులు కొన్ని రూల్స్ విధిస్తాయి. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి (మెట్రో, అర్బన్, రూరల్) ఖాతాలో నెలకు సగటున రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ‘కనీస నిల్వ’ (Minimum Average Balance) ఉండాలి.నెల చివరకు వచ్చేసరికి ఈ సగటు నిల్వ తగ్గితే చాలు… సిస్టమ్ ఆటోమేటిక్‌గా మీ ఖాతా నుంచి ఫైన్ రూపంలో డబ్బులు కట్ చేస్తుంది. చాలామంది స్టేట్మెంట్లు సరిగ్గా గమనించకపోవడం వల్ల, ప్రతినెలా ఈ కోత పడుతున్నా గుర్తించలేకపోతుంటారు.
ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ బ్యాంకులు: ఏవి ముందున్నాయి?
పార్లమెంట్లో ప్రభుత్వం వెల్లడించిన డేటాను నిశితంగా పరిశీలిస్తే, ఈ పెనాల్టీల వసూళ్లలో స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి.
HDFC Bankరూ. 1,798.14 కోట్లు,
Axis Bankరూ. 1,081.33 కోట్లు,
ఇతర ప్రైవేట్ బ్యాంకులు (17 బ్యాంకులు)రూ. 2,069.24 కోట్లు,
మొత్తం ప్రైవేట్ బ్యాంకులు (19 బ్యాంకులు)రూ. 4,948.71 కోట్లు.
మొత్తం ప్రభుత్వ బ్యాంకులు (12 బ్యాంకులు)రూ. 2,137.92 కోట్లు ఫైన్ గా చెల్లించాయి.
దేశంలో ఉన్న 19 ప్రైవేట్ బ్యాంకులు వసూలు చేసిన మొత్తం పెనాల్టీల్లో ఒక్క HDFC, యాక్సిస్ బ్యాంకుల వాటాయే 58 శాతం ఉండటం గమనార్హం. గత నాలుగేళ్ల (FY23 – FY26) డేటా ఆధారంగా చూస్తే… HDFC, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులు ఖాతాదారుల నుంచి వసూలు చేసిన మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు, దేశంలోని మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు సేకరించిన మొత్తం కంటే చాలా ఎక్కువ.
ఇక్కడ రెండు రకాల బ్యాంకింగ్ పద్దతులు, విధానాలు స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఎస్బీఐ లాంటి ప్రభుత్వ బ్యాంకులు సామాన్యుడికి బ్యాంకింగ్‌ను చేరువ చేయాలనే ఉద్దేశంతో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను, పెనాల్టీలను ఎత్తివేయడమో లేదా భారీగా తగ్గించడమో చేశాయి. కానీ ప్రైవేట్ బ్యాంకులు మాత్రం దీన్ని తమ వ్యాపార వృద్ధిలో ఒక ప్రధాన ఆదాయ వనరుగా కొనసాగిస్తున్నాయి.
దెబ్బతినేది ఎవరు?
ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే… ఈ మినిమమ్ బ్యాలెన్స్ కోతలు కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్న కార్పొరేట్ అకౌంట్లపై పడవు.
నెలాఖరు వచ్చేసరికి జీతం అయిపోయి అకౌంట్ ఖాళీ అయ్యే మధ్యతరగతి ఉద్యోగి, సరుకులు కొనడానికి లేదా వ్యాపార అత్యవసరాలకు నిధులు విత్‌డ్రా చేసుకునే చిన్న వ్యాపారి, కంటిన్యూయస్‌గా పాకెట్ మనీపై ఆధారపడే విద్యార్థి… వీళ్లే ఈ నిబంధనకు ప్రధాన బాధితులు. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలోనే బ్యాంకులు వేసే ఈ పెనాల్టీ, వారి అకౌంట్లను మైనస్‌లోకి తీసుకెళ్లడం లేదా ఉన్న కొద్దిపాటి పొదుపును కూడా కరిగించడం చేస్తున్నాయి.
నియంత్రణ సంస్థల వైఖరి ఏమిటి?
పార్లమెంట్లో ఈ విషయమై ప్రజాప్రతినిధులు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. “కనీస బ్యాలెన్స్ నిబంధనలు, ఛార్జీలను నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకు ఉంది. ఇది ఆర్బీఐ ప్రత్యక్ష నిబంధనల పరిధిలోకి రాదు” అని ఆర్బీఐ గవర్నర్ గతంలోనే స్పష్టం చేశారు.
అయితే ‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’ (PMJDY) ఖాతాలకు, అలాగే ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్’ (BSBDA) ఖాతాలకు ఈ పెనాల్టీల నుంచి రక్షణ ఉందనేది ఒక్కటే ఊరటనిచ్చే అంశం.
మీ అకౌంట్లో కూడా కట్ అయిందా?
ఒక్కసారి మీ గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూడండి. స్టేట్మెంట్లో ‘MAB Charges’, ‘Minimum Balance Penalty’, లేదా ‘Service Charges’ పేరుతో ఏమైనా అమౌంట్ కట్ అయిందేమో గమనించండి.
ఒకవేళ మీ సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచడం కష్టంగా ఉంటే, మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి ఆ అకౌంట్‌ను ఛార్జీలు లేని ‘BSBDA (జీరో బ్యాలెన్స్)’ ఖాతాగా మార్చుకోవడం మంచిది.
మీ అకౌంట్ నుంచి కూడా బ్యాంకులు ఎప్పుడైనా ఇలా మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో డబ్బులు కట్ చేశాయా?








