మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు: సానా సతీష్ బాబు
ఢిల్లీ: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు విమర్శించారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, జగన్‌ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాటు బీఈడ్, డీఈడ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతను ఎదురుచూపుల్లో ఉంచి, ఎన్నికల ముందు ఉద్యోగాలు, డీఎస్సీ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిన చరిత్ర వైసీపీ దేనని మండిపడ్డారు. అలాంటి నాయకులు ఇప్పుడు మెగా డీఎస్సీపై విమర్శలు చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని, ఇచ్చిన హామీ మేరకు కేవలం 100 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేశారని తెలిపారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 150కి పైగా కోర్టు కేసులు వేసిన వారే ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నట్లు నటించడం రాజకీయ కపటత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అన్ని న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి చట్టబద్ధంగా నియామకాలు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఉద్యోగాలు సాధించిన 16 వేలకుపైగా అభ్యర్థులను, వారి కుటుంబాలను అవమానిస్తున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాలలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకుని అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ మొత్తం వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యారంగంలో వేగంగా సంస్కరణలు అమలవుతున్నాయని, ఉపాధ్యాయ నియామకాలు, విద్యార్థుల సంక్షేమం, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని జీర్ణించుకోలేక వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని సానా సతీష్ బాబు దుయ్యబట్టారు. మెగా డీఎస్సీపై ఆరోపణలు నిరూపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరినా వైసీపీ నాయకులు వెనక్కి తగ్గారని గుర్తుచేశారు. తప్పుడు ప్రచారాలు మానేసి, మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి సవాల్ విసిరిన ఆయన.. ఉద్యోగాల విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోగా, వైసీపీ మాత్రం నిరుద్యోగ యువతను మోసం చేసిందనే నిజాన్ని ప్రజలు గమనించారని స్పష్టం చేశారు.








