‘వారణాసి’ అసలు ఛాలెంజ్.. బ్లాక్ బస్టర్ అవ్వటం కాదు! మరి…?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు సినిమాలపై ఉండే ఒత్తిడి ఒక్కటే.
ప్రేక్షకులు మెచ్చుకుంటారా… లేదా?, మొదటి రోజు థియేటర్‌కు వస్తారా?, హిట్ అవుతుందా… ఫ్లాప్ అవుతుందా? అంతవరకే. కానీ ఇప్పుడు భారతీయ సినిమా పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు ఒక సినిమాపై పడుతున్న అతిపెద్ద ఒత్తిడి ప్రేక్షకుల నుంచి కాదు. బిజినెస్ సైడ్ నుంచి. అదే ఈ తరం సినిమా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన అతి పెద్ద మార్పు.
సరిగ్గా అర్దం చేసుకుంటే …హిట్ సినిమా… బిజినెస్ హిట్ సినిమా… రెండూ ఇప్పుడు ఒకటి కాదు. ఎందుకంటే ఒక సినిమా ప్రేక్షకులకు నచ్చొచ్చు. రివ్యూలు బాగుండొచ్చు. వందల కోట్లు వసూలు చేయొచ్చు. అయినా ఆ సినిమా బిజినెస్ పరంగా విజయవంతమైందని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.
ఎందుకంటే సినిమా విజయం ఇప్పుడు కలెక్షన్లతో మాత్రమే కొలవడం లేని పరిస్ధితి. ఎంతకు అమ్మారు… ఆ పెట్టుబడిని ఎంతవరకు రికవర్ చేసింది… అనేదే అసలు కొలమానం.
అంటే…ప్రేక్షకుల అంచనాలు ఒక వైపు ఉంటే… వ్యాపార అంచనాలు మరో వైపు ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడానే ఇప్పుడు భారతీయ సినిమా వ్యాపారాన్ని నిర్వచిస్తోంది. ప్రతీ పెద్ద సినిమాకూ ఇదే జరుగుతోంది.
‘వారణాసి’… ఒక సినిమా కాదు, మారుతున్న సినిమా ఎకానమీకి ఉదాహరణ
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ గురించి ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న ఒక ప్రచారం ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. నైజాం థియేట్రికల్ హక్కుల కోసం ₹150 కోట్ల వరకు కోట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఖ్యను నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ ప్రచారం ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతోంది.
మార్కెట్ ఇప్పుడు సినిమాను కొనడం లేదు. ఒక ఈవెంట్‌ను కొనుగోలు చేస్తోంది.
ఒక్క నైజాం ₹150 కోట్లు అయితే… మిగతా ప్రపంచం ఎంత?
తెలుగు సినిమా బిజినెస్ కేవలం నైజాం ఒక్కటే కాదు. ఆంధ్ర. సీడెడ్. కర్ణాటక. తమిళనాడు. కేరళ. హిందీ బెల్ట్. ఓవర్సీస్.గ్లోబుల్ మార్కెట్. ప్రతి ప్రాంతంలోనూ మార్కెట్ అదే స్థాయిలో పెరిగితే, విడుదలకు ముందే సినిమా థియేట్రికల్ వ్యాపారం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అక్కడే అసలు బిజినెస్ ప్రెజర్ మొదలవుతుంది.
ఇప్పుడు సినిమా ముందున్న ప్రశ్న ‘హిట్ అవుతుందా?’ కాదు… ‘ఈ బిజినెస్‌ను మోస్తుందా?’
ఒక డిస్ట్రిబ్యూటర్ ₹150 కోట్లకు హక్కులు తీసుకుంటే… అతను ₹150 కోట్లు మాత్రమే తిరిగి ఆశించడు. అతను లాభం ఆశిస్తాడు. పెట్టుబడిపై రాబడి ఆశిస్తాడు. అందుకే ట్రేడ్‌లో ఒక సాధారణ చర్చ ఉంటుంది. భారీ ధరలకు అమ్ముడైన సినిమాలు వాటికి తగ్గట్టే భారీ బాక్సాఫీస్‌ను కూడా అందించాలి.
ఒకవేళ నైజాం డీల్ నిజంగానే ₹150 కోట్ల స్థాయిలో జరిగితే, అక్కడి బాక్సాఫీస్ కూడా అందుకు తగ్గ స్థాయిలో ఉండాల్సిందే. లేకపోతే ఆర్థిక సమీకరణాలు కష్టమవుతాయి. అంటే… సినిమా ఇప్పుడు ప్రేక్షకుల తీర్పును మాత్రమే కాదు… పెట్టుబడిదారుల లెక్కలను కూడా గెలవాలి.
రాజమౌళి బ్రాండ్‌కు మార్కెట్ విలువ ఎంత?
హాలీవుడ్లో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా ప్రకటిస్తే, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు, స్టూడియోలు ముందుగానే భారీ అంచనాలు పెంచుకుంటాయి. జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ ఫ్రాంచైజీకి కూడా ఇదే పరిస్థితి. భారతదేశంలో ఇప్పుడు అలాంటి మార్కెట్ నమ్మకాన్ని సంపాదించిన దర్శకుల్లో రాజమౌళి అగ్రస్థానంలో ఉన్నారు.
‘బాహుబలి’ భారతీయ సినిమా మార్కెట్‌ను విస్తరించింది. ‘ఆర్ఆర్ఆర్’ దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ‘వారణాసి’పై కనిపిస్తున్న బిజినెస్ చర్చ… ఆ నమ్మకానికి మార్కెట్ కట్టిన విలువగా చూడవచ్చు.
సినిమా వ్యాపారం ఇప్పుడు కొత్త యుగంలోకి ప్రవేశించింది ఒకప్పుడు శాటిలైట్ హక్కులు అదనపు ఆదాయం. తర్వాత డిజిటల్ హక్కులు వచ్చాయి. ఇప్పుడు ఓవర్సీస్, IMAX, ప్రీమియం ఫార్మాట్లు, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్, బ్రాండ్ భాగస్వామ్యాలు… ఇవన్నీ కలిపి సినిమా వ్యాపారాన్ని పూర్తిగా మార్చేశాయి. విడుదలకు ముందే భారీ రికవరీలు జరిగే ఈ మోడల్లో, థియేట్రికల్ బిజినెస్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
అందుకే ఈరోజు ఒక సినిమా విజయాన్ని నిర్ణయించేది కేవలం ప్రేక్షకుల చప్పట్లు కాదు. దాని మీద మార్కెట్ పెట్టిన వేల కోట్ల నమ్మకాన్ని అది నిలబెట్టగలిగిందా లేదా అనేదే అసలైన పరీక్ష.
ఈ క్రమంలో ‘వారణాసి’ కేవలం మరో సినిమా కాదు… భారతీయ సినిమా బిజినెస్ ఎటు వెళ్తుందో చూపించే కేస్ స్టడీ. ‘వారణాసి’ ఆ బిజినెస్ భారాన్ని విజయవంతంగా మోస్తే…అది కేవలం మరో బ్లాక్‌బస్టర్ కాదు. భారతీయ సినిమా బిజినెస్‌కు మరో కొత్త బెంచ్‌మార్క్ అవుతుంది.








