అమెరికాకు మరోసారి పాక్ వెన్నుపోటు.. చైనా నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల తరలింపునకు సహకారం..!
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు పాక్ వెన్నుపోటు పొడుస్తోందా..? ఓవైపు చర్చల్లో భాగస్వామిగా ఉంటూనే.. ఇరాన్ కు వెనక నుంచి మద్దతుగా నిలుస్తోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లేటెస్టుగా అమెరికా (USA) విమానాలు, హెలికాప్టర్లకు తలనొప్పిగా మారిన కొన్ని ఆయుధాలను చైనా (China) నుంచి ఇరాన్ (Iran)కు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటి రవాణాకు పాకిస్థాన్‌ను మార్గంగా ఎంచుకొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలన కథనం ప్రచురించింది. దీంతో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. పాక్ పేరు ఎత్తకుండా చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
చైనా నుంచి దాదాపు 60 మిలియన్ డాలర్లకు పైగా విలువైన 400 షోల్డర్‌ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. వీటితో తమ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. అయితే.. ఈ డీల్‌కు టెహ్రాన్ పక్షాన హాంకాంగ్ చెందిన ఝాంగ్కింగ్ బావోషాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మధ్యవర్తిగా ఉంది. ఈ క్షిపణులను ఉత్తర చైనా నుంచి పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌లోకి చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కాకపోతే వీటిని భూమార్గంలో తరలిస్తారా..? గగనతలంలో తీసుకెళతారా అనే అంశంపై స్పష్టత లేదు.
ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై స్పందించారు. చైనా ఆయుధాల సరఫరా విషయం తెలుసుకొని తాను నిరాశకు గురైనట్లు పేర్కొన్నారు. తాము ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా తనకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చైనా, రష్యాల నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని గత వారం ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు.








