సిలికానాంధ్ర రజతోత్సవాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా అడుగులు!
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ప్రఖ్యాత ఓక్లాండ్ అరెనా వేదికగా సిలికానాంధ్ర సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్’ (రజతోత్సవాలు) జులై 31 నుండి ఆగస్టు 1, 2026 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పాతికేళ్ల సాంస్కృతిక ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై విశ్వవ్యాప్తం చేసేలా నిర్వాహకులు ఈ వేడుకల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగంగా ప్రవాసాంధ్రులను, కళా ప్రియులను మంత్రముగ్ధులను చేసేందుకు పలు అద్భుతమైన కార్యక్రమాలను రూపకల్పన చేశారు:
కుంభ హారతి: ఏకంగా 108 మంది నర్తకీమణులు, 108 పవిత్ర కలశాలతో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ దివ్యమైన కుంభ హారతి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
సంగీతామృతవర్షిణి: సాంప్రదాయాన్ని, సంగీత ఆత్మను ప్రతిబింబించేలా సాగే అద్భుతమైన శాస్త్రీయ సంగీత సవ్వడి.
లయ అమృతవర్షిణి: శ్రోతల్లో ఉత్సాహాన్ని నింపుతూ, తెలుగువారి ఐక్యతను విశ్వానికి చాటే అరుదైన లయ విన్యాసాలు.
కూచిపూడి నాట్యామృతవర్షిణి: తరాలను దాటి నిలిచే మన శాశ్వత సాంప్రదాయాలను, కళా వైభవాన్ని చాటిచెప్పే కూచిపూడి నృత్య ప్రదర్శనలు.
లలితా గీతామృతవర్షిణి: తెలుగువారి మధురమైన జ్ఞాపకాలను, తీపి గుర్తులను తలపించే లలిత గీతాల అాలాపన.
శతక శంఖారావం: భావితరాలను ఉత్సాహపరిచే కాలాతీత పద్యాల సుధాధార.
వందే భారతం: ‘ఒకే భారతదేశం – ఒకే హృదయస్పందన’ అనే నినాదంతో దేశభక్తిని ఇనుమడింపజేసే ప్రత్యేక కార్యక్రమం.
దక్ష యజ్ఞం: పురాణ ఇతిహాసాలను కళ్లకు కట్టే అద్భుతమైన పౌరాణిక ప్రదర్శన.
జానపద జాతర: మన నేల స్ఫూర్తిని, అచ్చమైన జానపద ఆత్మను కదిలించే రంగుల కళారూపాలు.
తెలుగు సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ నలుమూలలకు చాటిచెప్పే ఈ దివ్య వేడుకల్లో సంగీత, నాట్య ప్రియులందరూ పెద్ద ఎత్తున పాలుపంచుకోవాల్సిందిగా నిర్వాహకులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.








