సిలికానాంధ్ర రజతోత్సవాలకు సర్వం సిద్ధం!
అమెరికా గడ్డపై తెలుగు భాషా పరిరక్షణకు, సంస్కృతీసంప్రదాయాల వికాసానికి గత పాతికేళ్లుగా విశేష సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ‘సిలికానాంధ్ర’ రజతోత్సవ వేడుకలకు వేదిక సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత ఓక్లాండ్ ఎరీనా (Oakland Arena) ప్రాంగణంలో జూలై 31 , ఆగస్టు 1 తేదీల్లో ఈ రెండు రోజుల మహాసంచలనం అత్యంత వైభవంగా జరగనుంది. విదేశాల్లో నివసించే తెలుగు ప్రజలకు మన సంస్కృతి గొప్పతనాన్ని కళ్లకు కట్టేలా నిర్వాహకులు ఈ వేడుకలను అద్భుతంగా రూపకల్పన చేశారు.
ఈ సంబరాలలో భాగంగా ప్రవాసాంధ్రులను అలరించేందుకు ఎన్నో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను సిద్ధం చేశారు. సాహిత్య ప్రియులను ఆకట్టుకునేలా ‘శతక శంఖారావం’, అచ్చమైన మన సంప్రదాయాలను చాటే ‘జానపద జాతర’, దేశభక్తిని ఇనుమడింపజేసే ‘వందేభారతం’తో పాటు ‘కళా కదంబం’, ప్రత్యేక నాటక ప్రదర్శనలు ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భావితరాలకు మన మాతృభాష ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
భారతీయ ఆధ్యాత్మిక సంగీత వైభవాన్ని చాటేలా శ్రీ తాళ్లపాక అన్నమాచార్య, భక్త రామదాసు , సంగీత సామ్రాట్ త్యాగరాజు కీర్తనల అాలాపనతో ‘సంగీతామృత వర్షిణి’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే తెలుగువారి మధురమైన లలిత సంగీత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా ‘లలిత గీతామృత వర్షిణి’ కూడా అలరించనుంది. వీటితో పాటు ఏకంగా 300 మంది మృదంగ కళాకారులు ఒకే వేదికపై ప్రదర్శించనున్న ‘లయామృత వర్షిణి’ లయ విన్యాసాలు ప్రేక్షకులను పరవశింపజేయనున్నాయి. ఇవే కాకుండా, తెలుగువారి గర్వకారణమైన నాట్యకళను ప్రదర్శించే ‘కూచిపూడి నాట్యామృత వర్షిణి’ ప్రత్యేక హంగులతో ప్రేక్షకులను కనువిందు చేయనుంది.
అమెరికా నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ రజతోత్సవాలను విజయవంతం చేయాలని సిలికానాంధ్ర నిర్వాహకులు తెలుగువారందరికీ పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రుల అంకితభావానికి, ఐక్యతకు ఈ వేడుకలు ప్రతీకగా నిలవనున్నాయి.








