టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్..?
ముంబై: భారత పురుషుల క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ స్థానంలో సరికొత్త కోచ్‌ను నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నాహాలు చేస్తోంది. ఈ రేసులో అస్సాంకు చెందిన మాజీ దేశీవాళీ క్రికెటర్, అనుభవజ్ఞుడైన కోచ్ శుభదీప్ ఘోష్ పేరు అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోంది. రాహుల్ ద్రవిడ్ హయాం (2021) నుంచి టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్న టి. దిలీప్ పదవీకాలం ఇటీవల ముగిసింది.
ద్రవిడ్ స్టాఫ్ మొత్తం తప్పుకున్నా, గౌతమ్ గంభీర్(Gautam Gambhir) విజ్ఞప్తి మేరకు దిలీప్ కాంట్రాక్ట్‌ను మరో ఏడాది పొడిగించారు. అయితే, తాజాగా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌తో ఆయన పొడిగింపు గడువు పూర్తయింది. గత కొంతకాలంగా భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోవడం, ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా 16 క్యాచ్‌లు చేజార్చడంపై విమర్శలు వచ్చాయి. దీంతో దిలీప్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ కూడా కేకేఆర్ (KKR) ఫ్రాంచైజీకి వెళ్లడంతో కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు అనివార్యమయ్యాయి.
అస్సాంలోని దిగ్బోయ్కు చెందిన సబ్దీప్ ఘోష్ (58).. గతంలో అస్సాం మరియు రైల్వేస్ జట్ల తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ బాధ్యతలు చేపట్టిన ఆయనకు జాతీయ క్రికెట్ అకాడమీ లో ఆరు నుంచి ఏడేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. రాహుల్ ద్రవిడ్ ఎన్సీఏ హెడ్‌గా ఉన్న సమయంలో సబ్దీప్ ఆయనతో కలిసి యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. సబ్దీప్ ఘోష్‌కు అండర్-19, ఇండియా-ఎ జట్లతో పాటు భారత మహిళల క్రికెట్ జట్టుకు కూడా ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది.
సౌతాఫ్రికాలో జరిగిన 2024 అండర్-19 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు ఆయనే ఫీల్డింగ్ కోచ్. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల కోచింగ్ ప్యానెల్‌లోనూ భాగస్వామిగా వ్యవహరించారు. ఇటీవలే జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత సీనియర్ జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కూడా ఆయన సేవలందించారు. యువ ఆటగాళ్లతో మంచి అనుబంధం, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ కోచింగ్ అనుభవం ఉండటంతో గంభీర్ నేతృత్వంలోని టీమిండియా సీనియర్ జట్టుకు సబ్దీప్ ఘోష్ సరైన ఎంపిక అని బోర్డు భావిస్తోంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కాబోయే రెండు టెస్టుల సిరీస్ నాటికి కొత్త ఫీల్డింగ్ కోచ్ నియామకంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.








