ఆళ్లగడ్డలో ఏం జరిగినా సెన్సేషనే : అఖిలప్రియ
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏ చిన్న వివాదం తలెత్తినా పార్టీ దృష్టికి తీసుకురావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) సూచించినట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) తెలిపారు. అహోబిలం ఆలయం (Ahobilam Temple)లో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై అధిష్ఠానం వివరణ కోరిన నేపథ్యంలో పల్లా శ్రీనివాస్‌తో ఆమె భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో అఖిలప్రియ మాట్లాడారు. అళ్లగడ్డ (Allagadda)లో ఏం జరిగినా పెద్ద సెన్సేషన్‌గా మారుతోంది. నిజానిజాలు తెలియకుండా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. నేను చెప్పాలనుకున్న వాటిని పల్లా శ్రీనివాస్‌కు వివరించా. నియోజకర్గంలోని వివాదాలు, సమస్యలపై పూర్తి సృష్టత ఇచ్చా. నియోజకవర్గంలో ఏ చిన్న వివాదం తలెత్తినా చెప్పాలని ఆయన సూచించారు. నా తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి (Bhuma Nagi Reddy), శోభ స్థాయికి ఎదగాలని, వారి పేరు నిలబెట్టేలా పనిచేయాలన్నారు. పార్టీ తరపున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ శ్రేణుల్లో అయోమయం ఉండకూడదనే పల్లా శ్రీనివాస్‌ను కలిశా అని తెలిపారు.








