పీఓకే ఎన్నికల్లో పాక్ హింస.. మానవ హక్కుల ఉల్లంఘనే అన్న భారత్..!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్నికల హింస..తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల సందర్భంగా నిరసనకారులు, పాకిస్తాన్ భద్రతాదళాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులపై పాక్ సైన్యం కాల్పుల్లో 40 మందికి పైగా చనిపోయారు.వేలాది మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చనిపోయిన వారి మృతదేహాలను తమకు ఇవ్వడం లేదని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతోన్న ఘర్షణలను (PoK Unrest) ప్రస్తావిస్తూ అమెరికా మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్’ వివాదాస్పద కథనం ప్రచురించింది. ‘‘స్థానిక ఎన్నికలు ప్రారంభం కాగానే పాకిస్థాన్ కశ్మీర్లో ఘర్షణలు చెలరేగాయి’’ అంటూ ఆ కథనానికి శీర్షిక పెట్టింది. దీనిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది (Indian Embassy). అందులో ప్రస్తావించిన పేర్లను ఖండించింది.
‘‘అది తప్పుదోవ పట్టించే శీర్షిక. పాకిస్థాన్ కశ్మీర్ అంటూ ఏదీ లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రమే (POK). కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే. వీటిలోని కొన్ని భాగాలను పాకిస్థాన్ (Pakistan) చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. ఇప్పుడు అక్కడి ప్రజలపై హింసకు పాల్పడుతోంది’’ అని భారత ఎంబసీ మండిపడింది.
పెరుగుతున్న ఖర్చులు, పాలనాపరమైన సమస్యలు, రాజకీయ వివక్ష వంటి అంశాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఈ నిరసనలకు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వం వహిస్తోంది. కాగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో (PoK) శాసనసభ ఎన్నికలు నిర్వహించడంపై భారత్ స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకునేందుకు (Pakistan) చేస్తున్న కపట ప్రయత్నాల్లో అవి భాగమని దాయాదిని దుయ్యబట్టింది.








