ట్విట్టర్లోనే మీ బ్యాంక్ అకౌంట్…?ఎలాన్ మస్క్ కొత్త గేమ్ ప్లాన్
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ట్విట్టర్లో పోస్టులు పెట్టడం చూశాం…
ఇక నుంచి డబ్బు కూడా దాచుకోవచ్చు అంటే నమ్ముతారా?
కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో ఇలా చెప్పి ఉంటే, అది ఖచ్చితంగా జోక్లాగే అనిపించేది. సోషల్ మీడియా అంటే పోస్టులు, ఫోటోలు, వీడియోలు, కామెంట్లు… అంతే. కానీ ఇప్పుడు ఆ నిర్వచనాన్నే మార్చాలని చూస్తున్నాడు ఎలాన్ మస్క్.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న X (మాజీ ట్విట్టర్)ను కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా కాకుండా, ఒక డిజిటల్ బ్యాంక్‌లా మార్చే దిశగా మస్క్ మరో పెద్ద అడుగు వేశాడు. X Money పేరుతో కొత్త ఫైనాన్షియల్ సర్వీస్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం అమెరికాలో ఎంపిక చేసిన X Premium, Premium+ వినియోగదారులకు ఈ సేవ అందుబాటులోకి వస్తోంది.
పోస్టులు కాదు… ఇప్పుడు డబ్బు కూడా!
X Moneyతో యూజర్లు యాప్‌లోనే డబ్బు నిల్వ చేసుకోవచ్చు, ఇతరులకు నేరుగా పంపించవచ్చు, బిల్లులు చెల్లించవచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేయవచ్చు. అంతేకాదు, అవసరమైతే ATM నుంచి నగదు తీసుకునేందుకు Visa డెబిట్ కార్డును కూడా అందిస్తోంది.
ఇప్పటివరకు Xలో ఒక ట్వీట్ పెట్టడానికి మాత్రమే లాగిన్ అయ్యేవారు. ఇకపై అదే యాప్‌ను డబ్బు పంపడానికి, సేవింగ్స్ నిర్వహించడానికి కూడా ఉపయోగించే రోజులను మస్క్ ఊహిస్తున్నాడు.
బ్యాంక్‌కు పోటీ మొదలైందా?
X Money కేవలం మరో డిజిటల్ వాలెట్ కాదు. డిపాజిట్ అకౌంట్లు, పీర్-టు-పీర్ పేమెంట్స్, డైరెక్ట్ డిపాజిట్లు, వైర్ ట్రాన్స్ఫర్లు, ఫిజికల్ చెక్కులు పంపే సౌకర్యం వరకు ఇందులో ఉన్నాయి. అంటే సోషల్ మీడియా, బ్యాంకింగ్, పేమెంట్స్ అన్నీ ఒకే యాప్‌లోకి తీసుకురావాలన్న “Everything App” వ్యూహంలో ఇది కీలక అడుగు.
ఒకప్పుడు చాటింగ్ కోసం ఒక యాప్, డబ్బు పంపడానికి మరో యాప్, బ్యాంకింగ్ కోసం ఇంకో యాప్ అవసరమయ్యేది. భవిష్యత్తులో ఇవన్నీ ఒకే యాప్‌లో జరిగితే ఎలా ఉంటుంది? మస్క్ సమాధానం… X.
కార్డు కూడా… క్యాష్‌బ్యాక్ కూడా!
X Money వినియోగదారులకు మెటల్ ఫినిష్‌తో Visa డెబిట్ కార్డును ఇస్తోంది. ఈ కార్డుపై యూజర్ X హ్యాండిల్ కూడా ఉంటుంది. దీనితో ATMల నుంచి నగదు డ్రా చేయవచ్చు, షాపుల్లో నేరుగా చెల్లింపులు చేయవచ్చు.
అంతేకాదు, 3 శాతం క్యాష్‌బ్యాక్, డిపాజిట్లపై గరిష్టంగా 6 శాతం వార్షిక రాబడి (APY) వంటి ప్రయోజనాలను కూడా ప్రకటించింది. వినియోగదారులను తన ప్లాట్ఫామ్లోనే ఎక్కువ కాలం ఉంచడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది.
అసలు డబ్బు ఎక్కడ ఉంటుంది?
X Money స్వయంగా బ్యాంక్ కాదు. వినియోగదారుల డిపాజిట్లను అమెరికాకు చెందిన నియంత్రిత బ్యాంక్ Cross River Bank నిర్వహిస్తుంది. అర్హత ఉన్న డిపాజిట్లకు అమెరికా FDIC నిబంధనల ప్రకారం బీమా రక్షణ కూడా ఉంటుంది. అంటే X యాప్‌లో సేవ అందించినా, డబ్బు మాత్రం నియంత్రిత బ్యాంకింగ్ వ్యవస్థలోనే ఉంటుంది.
భారత్‌కు వస్తే…?
ఇప్పటికైతే X Money అమెరికాకే పరిమితమైంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సేవను విస్తరించాలన్న లక్ష్యాన్ని ఎలాన్ మస్క్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు.
ఒకవేళ భారత్‌లోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. ప్రస్తుతం Google Pay, PhonePe, Paytm, WhatsApp Pay ఆధిపత్యం చూపుతున్న డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో X కూడా కొత్త పోటీదారుగా మారే అవకాశం ఉంది.
మస్క్ అసలు గేమ్ ఇదే!
ఎలాన్ మస్క్ లక్ష్యం కేవలం మరో పేమెంట్ యాప్‌ను ప్రారంభించడం కాదు. ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవసరమైన దాదాపు ప్రతి డిజిటల్ సేవ ఒకే యాప్‌లో ఉండే ప్రపంచాన్ని నిర్మించాలనుకుంటున్నాడు.
సోషల్ మీడియా, వీడియోలు, చాటింగ్, షాపింగ్, బ్యాంకింగ్, పేమెంట్స్… ఇవన్నీ ఒకే చోట జరిగితే, మనం బ్యాంక్ యాప్‌ను వేరుగా ఓపెన్ చేసే రోజులు కూడా క్రమంగా తగ్గిపోవచ్చు.
మస్క్ ‘ఎవ్రీథింగ్ యాప్’ కల:
1999లోనే మస్క్ ‘X.com’ అనే ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను ప్రారంభించారు (అది ఆ తర్వాత PayPalగా మారింది).
చైనాకు చెందిన ‘WeChat’ లాగా X ను కూడా “ఎవ్రీథింగ్ యాప్” (అన్ని సేవలు ఒకే చోట లభించే యాప్)గా మార్చాలనేది మస్క్ దీర్ఘకాలిక లక్ష్యం.
అయితే, ఈ సర్వీస్‌ను 2024 చివరినాటికే తీసుకువస్తానని చెప్పిన మస్క్, అనుకున్న సమయం కంటే దాదాపు రెండేళ్లకు పైగా ఆలస్యంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు.
ఆందోళనలు & విమర్శలు:
నమ్మకమైనదేనా?: ఆన్లైన్లో అసత్య ప్రచారాలు (Misinformation), వివాదాస్పద కంటెంట్ ప్రచారానికి వేదికగా మారిన కంపెనీకి తమ జీవితకాల కష్టార్జితాన్ని అప్పగించడంపై ప్రజలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదం పొంచి ఉందా?: అమెరికా సేనేటర్ ఎలిజబెత్ వారెన్ ఈ విషయంపై హెచ్చరిస్తూ మస్క్‌కు లేఖ రాశారు. X వేదికను నడిపించడంలో విఫలమైన ట్రాక్ రికార్డ్ ఉన్నందున, వినియోగదారుల ఫైనాన్స్‌లోకి ప్రవేశించడం వల్ల వినియోగదారుల భద్రతకు, ఆర్థిక రంగానికి ప్రమాదమని పేర్కొన్నారు.
ఏదైమైనా
ఇన్నాళ్లూ ట్విట్టర్లో మాటలు మాత్రమే తిరిగేవి. ఇప్పుడు… డబ్బు కూడా తిరిగే రోజులకు శ్రీకారం చుట్టాడు ఎలాన్ మస్క్. ఈ ప్రయోగం ఎంత విజయవంతమవుతుందో కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది… సోషల్ మీడియా భవిష్యత్తును మార్చాలన్న మస్క్ ప్రయత్నం, ఇప్పుడు నేరుగా మన పర్సు వరకు చేరుకుంది.








