రావణుడు అంటే ఎన్టీఆరే… అందుకే కొత్త రావణుడికి కనెక్ట్ అవుతున్నామా?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
తెలుగు ప్రేక్షకుడి మనసులో రావణుడు అంటే ఇప్పటికీ మొదట గుర్తుకొచ్చేది మహా నటుడు నందమూరి తారక రామారావే.
రాజసంగా మెరిసే కిరీటం… పొడవాటి మీసాలు… గంభీరమైన చూపు… శివభక్తుడి ఠీవి… మహా పండితుడి ఆత్మవిశ్వాసం… ఇవన్నీ కలిసిన రావణుడి రూపాన్ని దశాబ్దాల క్రితమే ఎన్టీఆర్ వెండితెరపై శాశ్వతంగా ముద్రించారు. ‘భూకైలాస్’, ‘సీతా రామ కల్యాణం’, ‘శ్రీ కృష్ణ సత్య’, ‘శ్రీ రామ పట్టాభిషేకం’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాల్లో ఆయన పోషించిన రావణుడు ఒక పాత్ర మాత్రమే కాదు… తెలుగు ప్రేక్షకుల ఊహల్లో స్థిరపడిపోయిన ఒక ప్రమాణం.
ముఖ్యంగా ‘శ్రీ కృష్ణ సత్య’, ‘శ్రీ రామ పట్టాభిషేకం’ చిత్రాల్లో రాముడు, రావణుడు రెండు పాత్రలనూ ఒకే సినిమాలో పోషించడం భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘట్టం. అంతేకాదు, ‘శ్రీ కృష్ణ సత్య’ లో రాముడు, రావణుడు, శ్రీకృష్ణుడు మూడు పాత్రలను పోషించిన ఘనత కూడా ఎన్టీఆర్కే దక్కింది.
అందుకే తెలుగు ప్రేక్షకుడు ప్రతి కొత్త రావణుడిని చూసినప్పుడు… తెలిసో తెలియకో, ఎన్టీఆర్ సృష్టించిన ఆ ప్రతిరూపంతోనే పోల్చి చూస్తాడు.
ఇదే నేపథ్యంలో ఇప్పుడు Ramayana ట్రైలర్ చుట్టూ జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది.
ట్రైలర్లో Yash కనిపించింది క్షణాలే కనిపించినా, సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దానికి కారణం కేవలం Yash స్టార్డమ్ మాత్రమే కాదు. రావణుడి పాత్రను రాజసంగా, గంభీరంగా, పురాణాల్లో వర్ణించిన వ్యక్తిత్వానికి దగ్గరగా చూపించే ప్రయత్నం కనిపించిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. చాలామంది అభిమానులు ఈ రూపకల్పనలో తాము చిన్నప్పటి నుంచి చూసిన సాంప్రదాయ రావణుడి ప్రతిబింబాన్ని చూస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక్కడే Adipurush గుర్తుకు వస్తోంది.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విడుదలైనప్పుడు రావణుడి రూపకల్పనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెయిర్‌స్టైల్ నుంచి కాస్ట్యూమ్ వరకు, బాడీ లాంగ్వేజ్ నుంచి మొత్తం డిజైన్ వరకు ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పురాణ పాత్రలను కొత్తగా చూపించడాన్ని వారు వ్యతిరేకించలేదు. కానీ ఆ పాత్రల అసలు స్వరూపం మారిపోయిందనే భావనతో స్పందించారు.
సినిమా పరిశ్రమలో ఒక మాట ఉంది. విజయాలు స్ఫూర్తినిస్తాయి… అపజయాలు పాఠాలు నేర్పుతాయి.
Adipurush తర్వాత పౌరాణిక పాత్రల రూపకల్పన విషయంలో మేకర్స్ మరింత అప్రమత్తంగా మారారనే అభిప్రాయం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు లేకపోయినా, Ramayana ట్రైలర్‌కు వస్తున్న స్పందన ఆ చర్చను మరింత బలపరుస్తోంది.
ప్రేక్షకుడు ఇప్పుడు భారీ VFX మాత్రమే కోరుకోవడం లేదు. పాత్రలోని ఆత్మను కూడా వెండితెరపై చూడాలనుకుంటున్నాడు. రావణుడు అంటే అతనికి కేవలం ఒక ప్రతినాయకుడు కాదు. మహా శివభక్తుడు, మహాపండితుడు, మహా చక్రవర్తి. ఆ గంభీరత తెరపై కనిపిస్తేనే ఆ పాత్రను అంగీకరిస్తాడు.
అందుకే Yash రావణుడి లుక్కు వస్తున్న ప్రశంసలను చాలామంది కేవలం ఒక కొత్త రూపకల్పన విజయంగా కాకుండా, ప్రేక్షకుల సాంస్కృతిక జ్ఞాపకాలను గౌరవించిన ప్రయత్నంగా కూడా విశ్లేషిస్తున్నారు.
అలాగని ఇది ఎన్టీఆర్‌ను అనుకరించడం కాదు. కానీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో దశాబ్దాలుగా నిలిచిపోయిన రావణుడి రాజసత్వం, గంభీరత, పౌరాణిక వైభవానికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం కనిపించిందనే భావన బలంగా వ్యక్తమవుతోంది.
ఒకే పాత్ర. ఒకే పురాణం. కానీ… ఒక రావణుడిని సోషల్ మీడియా ట్రోల్ చేసింది. మరో రావణుడిని అదే సోషల్ మీడియా ప్రశంసిస్తోంది. అంతకు ముందు వచ్చిన రావణుడుని ఎప్పటికీ మర్చిపోలేమంటోంది.
బహుశా దీనికి కారణం ఒక్కటే కావచ్చు. ప్రేక్షకులు మారలేదు… వారి మనసుల్లో ఉన్న రావణుడి ప్రతిరూపం కూడా మారలేదు. దానికి దగ్గరగా వెళ్లిన పాత్రను వారు ఆలింగనం చేసుకున్నారు. దానికి దూరంగా వెళ్లిన పాత్రను తిరస్కరిస్తున్నారు.








