కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ రహస్య స్పాన్సర్ కోహ్లినా..?
క్రికెట్ మైదానంలో తన పరుగుల వరదతో రికార్డులను తిరగరాసే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), సమాజంలో చాలా మంది విమర్శకులు భావిస్తున్నట్లు స్వార్థపరుడు కాదని నిరూపించే ఒక అద్భుతమైన నిజం వెలుగులోకి వచ్చింది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో దేశానికి బంగారు పతకాన్ని అందించిన హర్యానా బాక్సర్ సాక్షి చౌదరి వెనుక కోహ్లీ నిశ్శబ్ద మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది.
కెరీర్లో తీవ్ర గాయాలు, నిరాశలతో రింగ్ లో కష్టపడుతున్న తరుణంలో ఆమె కలలను సజీవంగా ఉంచడానికి విరాట్ కోహ్లీనే స్వయంగా స్పాన్సర్‌గా నిలిచారు. సాక్షి చౌదరి స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమెకు కఠినమైన రోజుల్లో దాదాపు 3 నుండి 4 సంవత్సరాల పాటు విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ద్వారా పూర్తి ఆర్థిక సహాయం, అత్యాధునిక శిక్షణ వనరులు లభించాయి. పతకం సాధించిన అనంతరం సాక్షి మాట్లాడుతూ.. “మైదానంలో విరాట్ భయ్యా చూపించే క్రమశిక్షణ, ఒత్తిడిని జయించే విధానం నాకు పెద్ద ఇన్సిపిరేషన్.
నా కెరీర్ ముగిసిపోతుందనుకున్న సమయంలో ఆయన అందించిన చేయూత వల్లే నేను ఈ రోజు దేశం గర్వించేలా గోల్డ్ మెడల్ గెలవగలిగాను” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. లైమ్ లైట్‌కు దూరంగా, ఎటువంటి ప్రచారం ఆశించకుండా ఇతర క్రీడాకారులను కోహ్లీ ప్రోత్సహిస్తున్న తీరుపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రోలర్స్ ఎప్పుడూ మైదానంలోని కోహ్లీ దూకుడును మాత్రమే చూపిస్తారని, కానీ తెర వెనుక ఆయన చేస్తున్న ఇటువంటి గొప్ప సామాజిక సేవలను చాలా అరుదుగా ప్రస్తావిస్తారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా, దేశంలో ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అథ్లెట్లకు అండగా నిలవడమే నిజమైన చాంపియన్ లక్షణమని క్రీడా విశ్లేషకులు కొనియాడుతున్నారు.








