ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అప్పటి నుంచే..?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మళ్లీ రాజుకోబోతోంది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా యోచిస్తోంది. సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సభ ప్రారంభమైన మొదటి రోజే స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో ప్రభుత్వ అజెండా, ప్రతిపక్షాల డిమాండ్లను బట్టి అసెంబ్లీ పనిదినాలను అధికారికంగా ఖరారు చేయనున్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, తేదీల ఖరారుపై రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయే అత్యంత కీలకమైన మంత్రివర్గ (Cabinet) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేబినెట్ భేటీలోనే అసెంబ్లీ వ్యూహాలు, సభలో ప్రవేశపెట్టాల్సిన ఆర్డినెన్స్‌లు, బిల్లులపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించనున్నారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే గవర్నర్ అనుమతితో అసెంబ్లీ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కానుంది.
ఈ వర్షాకాల సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే ఇటీవల సీఆర్డీఏ సమావేశంలో ఆమోదించిన అమరావతి మెగా ప్రాజెక్టుల నిధులు, ల్యాండ్ పూలింగ్ అంశాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘బీసీ రక్షణ చట్టం’ ముసాయిదా బిల్లు ఈ సమావేశాల్లోనే సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీటికి తోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సూపర్ సిక్స్ హామీల అమలు తీరుపై కూడా సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ద వాతావరణం నెలకొనే అవకాశం కనపడుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.








