ఐపీఎల్లో కొత్త కెప్టెన్సీ టాపిక్..లక్నో కెప్టెన్ అతనే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ వేలానికి ముందే ఫ్రాంచైజీల్లో కెప్టెన్ల మార్పులపై విస్తృతంగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు కొత్త సారథి ఎవరు కాబోతున్నారనే అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో అడుగు స్థానంలో నిలవడంతో పాటు, జట్టు కెప్టెన్ రిషబ్ పంత్(Rishab Pant) తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కు లక్నో బాధ్యతలు అప్పగిస్తారంటూ వస్తున్న వార్తలపై అతను తాజాగా స్పందించాడు.
ఈ కెప్టెన్సీ రేసు మరియు ఊహాగానాలపై ఐడెన్ మార్క్రమ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో జట్టుకు కెప్టెన్ కావడం గురించి ప్రస్తుతానికి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసాడు. ఫ్రాంచైజీ యాజమాన్యం తమ జట్టుకు ఏది మంచిదని భావిస్తే ఆ నిర్ణయమే తీసుకుంటుందని వ్యాఖ్యానించాడు. తమ జట్టులో నాయకత్వ లక్షణాలు ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, కాబట్టి తాను కెప్టెన్సీ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని పేర్కొన్నాడు.
జట్టు ఎవరికి బాధ్యతలు అప్పగించినా వారు సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం తనకు ఉందని, ప్రస్తుతం తన దృష్టి అంతా ఆటపైనే ఉందని మార్క్రమ్ వివరించాడు. దక్షిణాఫ్రికా స్టార్ అయిన 31 ఏళ్ల మార్క్రమ్ ను సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని లక్నో ఫ్రాంచైజీ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా టీ20 జట్టును విజయవంతంగా నడిపిస్తున్న అనుభవం అతనికి ఉంది. అంతేకాకుండా ఎస్ఏ20 (SA20) లీగ్లో లక్నోకు అనుబంధంగా ఉన్న డర్బన్స్ సూపర్ జెయింట్స్ జట్టుతోనూ మంచి అనుబంధం ఉంది. ఈ కారణాల చేతనే రిషబ్ పంత్ తప్పుకున్నాక లక్నో తదుపరి కెప్టెన్ రేసులో మార్క్రమ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఫ్రాంచైజీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేస్తుందో చూడాలి.








