న్యూజెర్సీలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుకు ఘన స్వాగతం
అమెరికాలోని న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ (BJP-USA) ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్‌రావు గౌరవార్థం నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం న్యూ జెర్సీ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఘనంగా జరిగింది. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి వందలాది మంది ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), బీజేపీ కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, సామాజిక ప్రముఖులు పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీ ఎన్. రాంచందర్‌రావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అఖండ భారత నిర్మాణం, దేశ సమగ్రాభివృద్ధి, సుశాసనం, జాతీయ భద్రత, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు.
గత పదకొండు–పన్నెండు సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగిందని, మౌలిక సదుపాయాల కల్పనలో అపూర్వమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో దేశంలో కేవలం 75 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ఎన్డీఏ ప్రభుత్వం గత 12 ఏళ్లలో వాటి సంఖ్యను 150కు పైగా పెంచి ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేసిందని తెలిపారు.
డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, గతి శక్తి, భారతమాల, సాగర్మాల, వందే భారత్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులు, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు దేశ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయని అన్నారు. ప్రపంచ దేశాల మధ్య భారతదేశ ప్రతిష్ఠను పెంచడంలో ప్రధాని మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల గౌరవాన్ని కూడా పెంచిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి తెలంగాణలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పంజాబ్‌లో కూడా త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కోశాధికారి డి. వాసుదేవరావు మాట్లాడుతూ, ఎన్. రాంచందర్‌రావు నిజాయితీ, నిబద్ధత, పోరాట స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాల విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడలేదని, “ఎన్. రాంచందర్‌రావు జెండా మారదు… అజెండా మారదు” అని వ్యాఖ్యానించారు. రానున్న జీహెచ్ఎంసీ, శాసనసభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ శ్రేణులు ఇప్పటికే ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయని తెలిపారు.
తెలంగాణ బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్. సాయిదిరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంచారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో భారతదేశం అంతర్జాతీయంగా విశేష గౌరవం పొందిందని, విదేశాల్లోని భారతీయుల ఆత్మవిశ్వాసం, గౌరవం మరింత పెరిగిందని పేర్కొన్నారు.

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షుడు విలాస్ రెడ్డి జంబులా మాట్లాడుతూ, అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దేశభక్తి, జాతీయవాద భావజాలంతో బీజేపీకి అండగా నిలుస్తున్నారని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రవాస భారతీయులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
కార్యక్రమానికి హాజరైన వందలాది మంది ఎన్నారైలు ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు, సంఘీభావాన్ని ప్రకటించారు. “వికసిత్ భారత్–2047” లక్ష్య సాధనలో తాము కూడా భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం “భారత్ మాతా కీ జై”, “వందే మాతరం”, “జై శ్రీరామ్”, “మోదీ… మోదీ” నినాదాలతో దేశభక్తి వాతావరణంలో కొనసాగింది.
ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (OFBJP-USA) మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారని అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను భారత అభివృద్ధిలో భాగస్వాములను చేయడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (OFBJP-USA) మాజీ అధ్యక్షులు కృష్ణారెడ్డి అనుగుల, జయేష్ పటేల్, ఓఎఫ్‌బీజేపీ న్యూజెర్సీ కో-కన్వీనర్ అమర్ గోస్వామి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) జాతీయ సమన్వయకర్త శరత్ వేముల పాల్గొని అతిథులను అభినందించారు. అలాగే కల్పనా శుక్లా, గుంజన్ మిశ్రా, అమిత్ పాండే, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, దీప్ భట్, పీయూష్ పటేల్, సుమ, రామ్ వేముల, రాజు రెడ్డి, ఉపేంద్ర చివుకుల, సురేష్ పటేల్, శ్రీనివాస్ జి., ప్రదీప్ కట్ట తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడంలో విశేషంగా కృషి చేశారు. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి హాజరైన వందలాది మంది ప్రవాస భారతీయులు ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు, సంఘీభావాన్ని ప్రకటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్నారైలు, బీజేపీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించి, ప్రవాస భారతీయులతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. కార్యక్రమం విందుతో ముగిసింది.








